Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విడుదలైన తొలి రోజే విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. ముఖ్యంగా రామ్ చరణ్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాకు లభిస్తున్న అద్భుతమైన స్పందనపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ నిమిత్తం పొల్లాచ్చిలో ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ విజయోత్సాహంలోనే ఉందని పేర్కొన్నారు. చిత్రబృందానికి, దర్శకుడు బుచ్చిబాబుకు, ముఖ్యంగా తన కుమారుడు రామ్ చరణ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
చరణ్ గత రెండేళ్లుగా ‘పెద్ది’ కోసం ఎంత కష్టపడ్డాడో తాను దగ్గర నుంచి చూశానని చిరంజీవి వెల్లడించారు. పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయని కొనియాడారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాకుండా, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోందని పేర్కొన్నారు. పెద్ది పాత్రలో పూర్తిగా లీనమవ్వడానికి చరణ్ అహర్నిశలు శ్రమించాడు. అతని కష్టం, నిజాయితీ, పాత్ర పట్ల చూపించిన నిబద్ధతకు ఈ విజయం సరైన గుర్తింపు. ప్రేక్షకులు అతని నటనను ఆదరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది అంటూ చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు.
అలాగే దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతిభను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంత బలమైన కథను రాసి, అదే స్థాయిలో తెరపై ఆవిష్కరించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. తొలి చిత్రంతోనే భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు కూడా శుభాకాంక్షలు తెలియజేశారు.సినిమాలో కీలక పాత్రలు పోషించిన శివ రాజ్‌కుమార్, జగపతి బాబు నటనను చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అప్పలసూరి పాత్రలో జగపతి బాబు జీవించారని, శివరాజ్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు.ఇక చిత్ర సాంకేతిక బృందాన్ని కూడా చిరంజీవి అభినందించారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు గొప్ప బలంగా నిలిచిందన్నారు. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా చిత్రీకరించారని, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా, ఎడిటర్ నవీన్ నూలి పనితీరును కూడా ప్రశంసించారు.అంతేకాకుండా హీరోయిన్ జాన్వీ కపూర్ సహా చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఈ విజయానికి కారణమైన మొత్తం టీమ్‌కు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ… pic.twitter.com/gZwN99aERV
— Chiranjeevi Konidela (@KChiruTweets) June 4, 2026