Chiru-Bobby | మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్ అంటే ‘వాల్తేరు వీరయ్య’ అనే బ్లాక్‌బస్టర్ చిత్రం గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో మెగా అభిమానులకు పక్కా మాస్ ట్రీట్ ఇచ్చిన ఈ జంట, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ సినిమా కథపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈసారి కేవలం మాస్ మసాలా కాకుండా, బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా చిత్రాన్ని తెరకెక్కించేందుకు బాబీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిరంజీవిని కొత్త కోణంలో చూపించేందుకు ప్రత్యేకంగా స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట.
ఈ ప్రాజెక్ట్ మెగా మల్టీస్టారర్‌గా రూపొందే అవకాశాలు ఉన్నాయనే వార్తలు అంచనాలను మరింత పెంచుతున్నాయి. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, బాలీవుడ్ ప్రముఖ నటుడు, దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించే అవకాశముందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వీరు నిజంగా ఈ ప్రాజెక్ట్‌లో చేరితే, సినిమా స్థాయి దేశవ్యాప్తంగా మరింత పెరగడం ఖాయం. ఇక హీరోయిన్ విషయంలో కూడా ఆసక్తికర అంశాలు వినిపిస్తున్నాయి. గ్లామరస్ బ్యూటీ డింపుల్ హయాతి ఈ సినిమాలో పవర్ఫుల్ నెగిటివ్ రోల్లో కనిపించనున్నట్లు సమాచారం. మెగాస్టార్‌తో ఆమె పాత్రకు ఉండే వైరం అంటే ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
టెక్నికల్‌గా కూడా ఈ సినిమా అత్యున్నత ప్రమాణాలతో ఉండబోతోందని తెలుస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించే అవకాశమున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన మ్యూజిక్ ఇస్తే సినిమా స్థాయి మరింత ఎత్తుకు చేరుతుందని మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు. సినిమాలో ఒక స్ట్రాంగ్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉండబోతుందని, అది కథలో కీలక మలుపుగా నిలుస్తుందని సమాచారం. బాబీ తన స్క్రిప్ట్‌లో మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్స్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రేక్షకులకు పూర్తి ఎంటర్టైన్మెంట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారట. ఏదేమైన మెగా అభిమానులకు మరోసారి భారీ మాస్ ఫీస్ట్ అందించేందుకు ఈ కాంబో సిద్ధమవుతోంది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో చూడాలి.