Chiru- Balayya | టాలీవుడ్ టాప్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరు కూడా టాలీవుడ్ టాప్ హీరోలే. వీరిద్దరు అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. రికార్డుల విషయాలలోను వారిద్దరు ఒకరిని మించి మరొకరు అనేలా ఉన్నారు. ఈ స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే అభిమానులకు పండగే. థియేటర్స్ వద్ద రచ్చ మాములుగా ఉండదు. వీరిద్దరూ బాక్సాఫీస్ దగ్గర చాలా సార్లు పోటీపడ్డారు. ఒకేసారి సినిమాలు రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ సృష్టించారు. ముఖ్యంగా సంక్రాతికి ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధమే అని చెప్పాలి.
ఇప్పటికే పది సార్లు చిరంజీవి- బాలయ్య సంక్రాంతి బరిలో నిలిచారు. ఇప్పుడు పదకొండో సారి వారిద్దరు పోటీ పడబోతున్నట్టు తెలుస్తుంది. చిరంజీవి అనీల్ రావిపూడి మూవీ సంక్రాంతికి రాబోతుందనే టాక్ నడుస్తుంది. అయితే వార్ వన్ సైడ్ అన్నట్లుగా పరిస్థితి అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అదే సంక్రాంతికి బాలకృష్ణ నటిస్తున్న అఖండ 2 సినిమా సైతం విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా బాలకృష్ణ సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి. కానీ ఈ సినిమా సూపర్ హిట్ అఖండ సినిమాకు సీక్వెల్, అంతే కాకుండా ఈ సినిమాకు బోయపాటి దర్శకత్వం వహిస్తున్నాడు.
వారిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్. ఈ నేపథ్యంలో సంక్రాంతికి అఖండ 2 వస్తే కచ్చితంగా పోటీ చాలా కఠినంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా థియేటర్ల విషయంలోనూ పోటీ కూడా గట్టిగా ఉంటుంది. కాగా, 2023లో ముచ్చటగా పదోసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య – బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమాలు పోటీ పడ్డాయి. ఆ రెండు చిత్రాలు మంచి విజయాలే సాధించాయి. మరి ఈ సారి సంక్రాంతి బరిలో ఆ హీరోలు పోటీ పడతారా లేదా అన్నది చూడాలి.