తారాగణం: చిరంజీవి, రవితేజ, శృతిహాసన్, కేథరిన్, రాజేంద్రప్రసాద్, బాబీ సింహా, ప్రకాష్‌రాజ్, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: ఆర్థర్ ఎ విల్సన్
సంగీతం: దేవిశ్రీప్రసాద్
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాత: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి
కథ, దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర
గత ఏడాది చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాపై ఆయన అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు తరహాలో కామెడీ, యాక్షన్ హంగులతో వింటేజ్ చిరంజీవిని ఈ సినిమాలో చూపించానని దర్శకుడు బాబీ కొల్లి ప్రచార కార్యక్రమాల సందర్భంగా చెప్పడంతో ఈ సంక్రాంతి సీజన్లో కావాల్సినంత వినోదం ఖాయమని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూశారు. మరి ఈ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ తెరపై చేసిన సందడి ఎలా ఉంది? ‘పూనకాలు లోడింగ్’ అంటూ అభిమానుల్లో జోష్ని పెంచిన ఈ సినిమా నిజంగా పూనకాలు తెప్పించిందా? లేదో తెలుసుకుందాం..
కథ ఏంటంటే:
వైజాగ్ జాలరిపేటకు చెందిన వాల్తేరు వీరయ్యకు (చిరంజీవి) సముద్రంపై తిరుగులేని పట్టుంటుంది. మనిషి కూడా చాలా సరదాగా ఉంటాడు. డ్రగ్ స్మగ్లర్స్ ముఠా కోస్టల్ గార్డులను కిడ్నాప్ చేస్తే వారిని రక్షించడానికి నేవీ అధికారులు కూడా వీరయ్యను ఆశ్రయిస్తుంటారు. మలేషియాలో డ్రగ్స్ వ్యాపారం చేస్తున్న సాల్మన్ సీజర్ (బాబీ సింహా) తనను అరెస్ట్ చేసిన పోలీసులను చంపి మారేడుమిల్లి పోలీస్ స్టేషన్‌ను నుంచి తప్పించుకుంటాడు. ఈ కేసులో పోలీస్ ఆఫీసర్ సీతాపతి (రాజేంద్రప్రసాద్) సస్పెండ్ అవుతాడు. సాల్మన్ సీజర్‌ను మలేషియా నుంచి కిడ్నాప్ చేసి ఇండియాకు తీసుకొచ్చే సమర్థత ఒక్క వీరయ్యకే ఉందని నమ్ముతాడు సీతాపతి. అందుకు వీరయ్యతో ఓ డీల్ కుదుర్చుకుంటాడు. ఈ ఆపరేషన్ కోసం మలేషియా వెళ్లిన వీరయ్య తాను వచ్చింది సాల్మన్ సీజర్ కోసం కాదని..అతని అన్న మైఖేల్ సీజర్ (ప్రకాష్‌రాజ్) కోసమని చెబుతాడు. ఇంతకి వీరయ్య, మైఖేల్ మధ్య ఉన్న శత్రుత్వం ఏమిటి? మలేషియాలో వీరయ్యకు పరిచయమైన అదితి (శృతిహాసన్) ఆయనకు ఎలాంటి సహాయం చేసింది? అన్నదమ్ములైన వీరయ్య, ఏసీపీ విక్రమ్‌సాగర్ (రవితేజ) మధ్య గతంలో ఏం జరిగింది? చివరకు మైఖేల్‌పై పోరాటంలో వీరయ్య ఎలా విజయం సాధించాడు? అన్నదే మిగతా సినిమా కథ..
కథా విశ్లేషణ:
చిరంజీవి కామెడీ చేసి చాలా రోజులైంది. సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి సినిమాలన్నీ సీరియస్ కథలతో రావడంతో మునుపటి వింటేజ్ చిరంజీవిని చూడాలని అభిమానులు ఉత్సుకతతో ఎదురుచూశారు. వారిని దృష్టిలో పెట్టుకొని కావాల్సినంత వినోదం, యాక్షన్ హంగులతో దర్శకుడు బాబీ ఈ కథ సిద్ధం చేశారు. కథగా చెప్పుకుంటే అంతగా కొత్తదనమేదీ కనిపించదు. తన వారికి జరిగిన అన్యాయానికి హీరో ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్నదే ఇతివృత్తం. అయితే చిరంజీవి తనదైన కామెడీ టైమింగ్, యాక్షన్‌తో ప్రేక్షకుల్ని ఆద్యంతం ఎంగేజ్ చేశారు. ఆయన లుక్స్ కూడా బాగున్నాయి. చాలా అందంగా కనిపించాడు. మలేషియాలో జరిగే ఎపిసోడ్లో చిరంజీవి తనదైన శైలి కామెడీతో ఆద్యంతం రక్తికట్టించారు. ఆయన కామెడీ టైమింగ్, ఈజ్ అబ్బురపరుస్తాయి. ఇంటర్వెల్ ఎపిసోడ్ ద్వితీయార్థంలో ఏం జరుగబోతుందోననే ఆసక్తిని పెంచుతుంది.
వీరయ్య సోదరుడు విక్రమ్ సాగర్ (రవితేజ) ఎంట్రీతో ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. రవితేజ పరిచయ ఘట్టాలు, యాక్షన్ ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. పోలీస్ పాత్రలో రవితేజ తనదైన మార్క్ నటనతో మెప్పిస్తాడు. వీరయ్యను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి హెచ్చరించడం..అక్కడ వీరయ్య, విక్రమ్‌సాగర్ మధ్య వచ్చే సన్నివేశాలు కామెడీని పంచాయి. ఒకరి సినిమాలోని డైలాగ్స్ ఒకరు చెప్పుకోవడం హైలైట్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో చిరంజీవి వింటేజ్ లుక్‌లో అభిమానుల్ని అలరిస్తాడు. నృత్యాల్లో తనదైన ఈజ్‌లో మెప్పించారు. అయితే అభిమానులు కోరుకునే వినోదం, పాటలు, ఫైట్స్ నృత్యాలు..ఇలా అన్ని అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన దర్శకుడు కథలో ఎమోషన్‌ను విస్మరించాడనిపిస్తుంది. చిరంజీవి,రవితేజ మధ్య బ్రదర్ సెంటిమెంట్‌ను మరింత బలంగా ఆవిష్కరిస్తే బాగుండేదనిపిస్తుంది. కథలో ఎమోషనల్ సీన్స్ ఏమంతగా ఆకట్టుకోలేదు. కథ, స్క్రీన్‌ప్లే మీద మరింత దృష్టిపెడితే బాగుండేది. కథాపరంగా లోపాలున్నా చిరంజీవి, రవితేజ తమదైన నటనతో సినిమాను నిలబెట్టారు.
నటీనటుల పర్ఫార్మెన్స్:
చిరంజీవికి ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. వింటేజ్ చిరంజీవిని గుర్తుకుతెస్తూ అభిమానుల్ని ఆకట్టుకున్నారు. ఫైట్స్, పాటల్లో తనదైన మార్క్‌తో మెప్పించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్, వ్యంగ్యంగా చెప్పే సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి. ఏసీపీ విక్రమ్సాగర్గా రవితేజ సినిమాకు బలంగా నిలిచారు. ద్వితీయార్థంలో కథను ఆయనే నడిపించారు. శృతిహాసన్ స్క్రీన్‌స్పేస్ తక్కువే అయినా కథలో కీలకమైన పాత్రను పోషించింది. కేథరిన్ కొన్ని సీన్స్‌కే పరిమితమైపోయింది. ప్రకాష్‌రాజ్, బాబీసింహా పాత్రల్లో బలమైన విలనీ కనిపించలేదు. రాజేంద్రప్రసాద్, శ్రీనివాస రెడ్డి, వెన్నెల కిషోర్ తమ పరిధుల మేరకు నటించారు. దేవిశ్రీప్రసాద్ పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్:
చిరంజీవి కామెడీ, వింటేజ్ లుక్స్, ఫైట్స్, రవితేజ ఎపిసోడ్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ, కథలో ఎమోషన్స్ లోపించడం
రేటింగ్: 3/5.