మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 158వ చిత్రం గురువారం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత చిరంజీవి-బాబీ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలేర్పడ్డాయి. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర హీరో పవన్‌కల్యాణ్ క్లాప్‌నివ్వగా, సుస్మిత కొణిదెల కెమెరా స్విఛాన్ చేశారు. తొలిషాట్‌కు వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
మాస్‌తో పాటు క్లాస్‌నూ అలరించేలా దర్శకుడు బాబీ కొల్లి అద్భుతమైన కథను సిద్ధం చేశారని, మెగాభిమానులకు ఓ పండగలా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ తెలిపారు. శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అనశ్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కార్తీక్ కన్నన్, సంగీతం: తమన్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, సంభాషణలు: భాను-నందు, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, రచన-దర్శకత్వం: బాబీ కొల్లి.