Chiranjeevi | చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాపై అంచనాలు మామూలుగా లేవు. మరో ‘జగదేకవీరుడు-అతిలోక సుందరి’ స్థాయిలో ఊహించేస్తున్నారు అభిమానులు. దర్శకుడు వశిష్ఠ కూడా పాత్రలను ఎంచుకునే విషయంలో పలు జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాడు. రీసెంట్గా కథానాయికగా త్రిషను సెలక్ట్ చేయడంతో ఈ సినిమా అంచనాలు మరింత పెరిగాయి. ఫిల్మ్వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి పారితోషికం డెభ్భైకోట్ల పైమాటేనట. అలాగే త్రిష కూడా పన్నెండుకోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు తెలుస్తున్నది. ఈ సినిమాతో దక్షిణభారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికగా త్రిష రికార్డ్ సృష్టించిందని చెప్పుకుంటున్నారు.
ఇప్పటివరకూ నయనతారపై ఉన్న రికార్డును త్రిష తిప్పి రాసిందట. ఇదిలావుంటే, ‘విశ్వంభర’ కథ విషయంలోనూ ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ‘జగదేకవీరుడు-అతిలోకసుందరి’లో హిమాలయాల్లోని మానససరోవరానికి వెళ్లి, అక్కడ్నుంచి మూలికలు తెచ్చి బేబీ షాలినీని కాపాడతాడు చిరంజీవి. అలాగే ‘విశ్వంభర’లో దుష్టశక్తులు తన భార్యను వేరే గ్రహానికి తరలించుకుపోతే, ఆ గ్రహానికి వెళ్లి, దుష్టశక్తుల్ని అంతం చేసి తన భార్యను తెచ్చుకుంటాడట చిరంజీవి. ‘జగదేకవీరుడు’కి అప్డేట్ వెర్షన్లా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్న విషయం తెలిసిందే.