చిత్ర పరిశ్రమ తమకు ఎంతో పేరు ప్రతిష్టలు, సంపద ఇచ్చిందని, ఆ పరిశ్రమకు తిరిగి సేవ చేయడం బాధ్యతగా భావిస్తున్నట్లు హీరో చిరంజీవి అన్నారు. ఇలా సేవా కార్యక్రమాలు చేసినప్పుడు కలిగే సంతృప్తి తన సినిమా సూపర్ హిట్ అయినా రాదని చెప్పారు. తన అభివృద్ధికి పరోక్షంగా కారణమైన సినీ కార్మికులకు చిత్రపురి కాలనీలో ఏడాది కల్లా 10 పడకల ఆస్పత్రిని నిర్మిస్తానని చిరంజీవి వెల్లడించారు. సెలబ్రిటీ క్రికెట్ కార్నివాల్ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ…‘మన అర్హతకు మించిన గొప్ప స్థాయిని సినీ పరిశ్రమ అందించింది. అలాంటి పరిశ్రమకు తిరిగి ఇవ్వగలగడం గొప్ప అవకాశం. నా వరకు సేవా కార్యక్రమాలు ఇచ్చే సంతృప్తి మరేదీ ఇవ్వదు. మన అభివృద్ధికి దోహదపడిన సినీ కార్మికుల కోసం చిత్రపురి కాలనీలో పది పడకల ఆస్పత్రిని నిర్మించబోతున్నా. నా ఈ పుట్టినరోజుకు పనులు మొదలుపెట్టి వచ్చే పుట్టినరోజుకు అందుబాటులోకి తీసుకొస్తాను. ఇందులో తోటి పరిశ్రమ వాసులు భాగమైనా సంతోషిస్తా. పేద సినీ కార్మికులకు ఆ ఆస్పత్రిలో ఉచిత వైద్య సేవలు అందిస్తాము’ అని చెప్పారు.