Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ఎనర్జీతో, స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను అబ్బురపరిచారు. ఇటీవల రవి స్టూడియోస్ వారి ఆధ్వర్యంలో ఆయన ఇంట్లో నిర్వహించిన ఫోటోషూట్ లో చిరంజీవి మార్చిన ఐదు నుంచి ఆరు కాస్ట్యూమ్స్‌కి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 70 ఏళ్ల వయసులోనూ చిరు ఇంత యంగ్ లుక్ లో కనిపించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యంతో.. 70 ఏళ్ల వయసులోను 40 ఏళ్ల కుర్రాడిలా అదరగొట్టేస్తున్నారు అని కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పర్యావరణ పరిస్థితులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం వంటివి మన ఆరోగ్యాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తున్న ఈ రోజుల్లో చిరంజీవిలాంటి హీరోలు చూపిస్తున్న ఫిట్నెస్ నిజంగా స్ఫూర్తిదాయకం.
ఇది దేవుని వరమో లేకుంటే, ఫిట్నెస్ పట్ల పట్టుదల ఫలితమో కాని, ఆయనలోని స్టైల్, గ్రేస్ మాత్రం అసలే తగ్గడం లేదు. ఇటీవల ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలోని “మీసాల పిల్ల” పాట ప్రోమోలో చిరంజీవి స్టైలింగ్ పై కొంత మంది విమర్శలు చేశారు. అయితే తాజా ఫోటోషూట్ ద్వారా చిరు అటువంటి కామెంట్లకు స్టైలిష్‌గా సమాధానం ఇచ్చినట్లే భావిస్తున్నారు అభిమానులు. ఇక ఈ ఫోటోలు చూస్తే చాలు, ఏం హ్యాండ్సమ్, ఏం ఛరీష్మా అన్న ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ‘భోళా శంకర్’ సినిమా తర్వాత చిరంజీవి కొంత గ్యాప్ తీసుకున్నారు. కానీ 2025లో ఆయన బిజీ బిజీగా ఉన్నారు.
జనవరిలో ‘మన శంకరవరప్రసాద్ గారు’ థియేటర్లకు రాబోతుండగా, ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వేసవిలో ‘విశ్వంభర’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ బాబీ తో ఒక పవర్ఫుల్ యాక్షన్ మూవీ కూడా డిసెంబరు లేదా జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. అంతేకాదు, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో ఓ వయలెంట్ డ్రామా చేయనుండగా, ఇందులో చిరంజీవి సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఇవి కాకుండా మరో రెండు, మూడు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తోంది. 70 ఏళ్ల వయసులోనూ చిరంజీవి చూపిస్తున్న స్టైల్, డెడికేషన్ యువతకు ప్రేరణగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. “వయసు ఓ సంఖ్య మాత్రమే” అనే మాటకు చిరంజీవి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. ఎంతకాలమైనా మెగాస్టార్ చిరు మ్యాజిక్ కొనసాగుతూనే ఉంటుంది.