Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చే అభినందన అనేది యువ నటీనటులకు ఒక అధికారిక గుర్తింపు లాంటిదే. వేదికపై మాట్లాడేటప్పుడు అందరినీ పొగడటం సాధారణమే. చిరు కూడా ఆ సంప్రదాయానికి మినహాయింపు కాదు. కానీ ఎవరూ అడగకుండానే, పరోక్షంగా ఒక నటుడి పేరు ప్రస్తావించి, అతడి ప్రతిభను మనస్ఫూర్తిగా కొనియాడితే… అది మాత్రం నిజంగా చాలా స్పెషల్.అలాంటి అరుదైన ప్రశంసను తాజాగా యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని బయటపెట్టింది ఎవరో కాదు… దర్శకుడు బాబీ కొల్లి.
సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో పోటీ పడి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది నవీన్ పొలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’. ఈ చిత్రంలో నవీన్ చేసిన పాత్రను చూసినవారు ఇది నిజంగా వన్ మ్యాన్ షో అని చెప్పక తప్పదు. స్క్రిప్టు రూపకల్పనలోనూ నవీన్ కీలక పాత్ర పోషించాడు. సినిమాను తన భుజాల మీద మోయడమే కాకుండా కథను మరింత బలంగా మలిచాడు. అయితే తాజాగా చిరంజీవితో తన కొత్త సినిమా చర్చల కోసం కలిసిన సందర్భంలో, మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను బాబీ కొల్లి ఓ వేదికపై వెల్లడించాడు.
చిరు గారు నాతో మాట్లాడుతూ… ‘అనగనగా ఒక రాజు సినిమా బాగుందట కదా. ఈ తరం నటుల్లో నాకు నచ్చిన హీరో నవీన్ పొలిశెట్టి’ అని చెప్పారు.ఈ మాటలు చెప్పగానే ఆడిటోరియం మొత్తం హోరెత్తింది. అక్కడ ఉన్న నవీన్ పొలిశెట్టి ఈ ప్రశంస విని అమితానందానికి గురయ్యాడు.బాబీ కొల్లి మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించాడు. తాను తరచుగా నవీన్‌తో మాట్లాడుతుంటానని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత ఓ ప్రమాదంలో గాయాలైనా, వాటిని లెక్కచేయకుండా ‘అనగనగా ఒక రాజు’ కోసం నవీన్ ఎంతగానో కష్టపడ్డాడని చెప్పారు.“ఆ కష్టం ఫలితమే ఈ రోజు అతడికి వచ్చిన సక్సెస్” అని బాబీ అన్నాడు. సాధారణంగా హీరోలు కావడానికి టైమ్ బాగుండాలని అంటారని, కానీ
టైమింగ్ కూడా బాగుండి, టైమింగ్ ఉన్న నటుడు నవీన్ పొలిశెట్టి అని బాబీ కొనియాడాడు.కాగా, సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నవీన్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలిచింది.