Chiranjeevi | ఆదివారం సాయంత్రం, జూబ్లీహిల్స్‌లోని సీఎం అధికార నివాసంలో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం చిరంజీవిని పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. వీరి మధ్య కొంతసేపు వ్యక్తిగత విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అయితే ఈ సడెన్ మీటింగ్‌కి సంబంధించిన గల కారణాలు అధికారికంగా వెలువడలేదు. ఇంతలోనే టాలీవుడ్లో ఓ సంచలన పరిణామం చోటు చేసుకుంది. 24 క్రాఫ్ట్‌లకి ప్రాతినిధ్యం వహించే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ షూటింగ్‌ల బంద్‌కు పిలుపునిచ్చింది.
తమ వేతనాలను 30శాతం పెంచాలని కోరిన కార్మిక సంఘాల డిమాండ్లను ఫిల్మ్ ఛాంబర్ అంగీకరించకపోవడంతో, ఆదివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీనితో ఫెడరేషన్ షూటింగ్‌లను నిలిపివేయాలని నిర్ణయించింది. 30శాతం పెంపుతో లేఖ ఇచ్చిన నిర్మాతల చిత్రాలకే కార్మికులు పని చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ కీలక సందర్భంలో చిరంజీవి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం పలు ఊహాగానాలకు దారి తీసింది. అయితే ఈ మీటింగ్‌కి షూటింగ్ బంద్‌కి సంబంధించిన అంశాలు సంబంధం లేదని తెలుస్తోంది.చిరంజీవి ఈ నెల 22న తన 70వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఏదైనా ప్రత్యేక వేడుక జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన సీఎం ని కలిశారా? లేదా రాజకీయంగా మరే అంశంపై చర్చించారా? అన్నది ఇప్పటివరకు స్పష్టత రాలేదు.
అయితే, ఈ భేటీపై ఇండస్ట్రీలో, రాజకీయ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న “విశ్వంభర” సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కాగా, ప్రస్తుతం వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలయ్యే అవకాశముంది. మరోవైపు, అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మెగా 157” అనే సినిమా కూడా చేస్తున్నారు. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా, చిరంజీవి మార్క్ యాక్షన్, అనిల్ మార్క్ వినోదంతో సంక్రాంతి 2026 విడుదలగా ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.