Chiranjeevi| మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్లో మంచి క్రేజ్ ఉన్న హీరో. ఆయన నటించిన చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయి, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెండితెరపై చిరుని చూసి సినిమాలలోకి రావాలని చాలా మంది కలలు కన్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలకి చిరంజీవే ఇన్సిపిరేషన్. ఈ విషయాన్ని వారే పలు సందర్భాలలో చెప్పుకొచ్చారు. అయితే ఆరు పదుల వయస్సులోను చిరంజీవి ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం విశ్వంభర సినిమాతో బిజీగా ఉండగా, ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాతో ఎలా అయిన పెద్ద హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు.
ఇక ‘విశ్వంభర’ తరవాత మెగా లైనప్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అనిల్ రావిపూడితో చిరు ఓ సినిమా చేస్తుండగా, ఈ సినిమా జూన్లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ గ్యాంగ్ లీడర్ తరహాలో ఉంటుందని టాక్. చిత్రాన్ని సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బాబితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో చిరంజీవి- బాబి కాంబినేషన్లో వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. చిరు కెరీర్లోనే అతి పెద్ద కమర్షియల్ హిట్ సినిమాగా కూడా నిలిచింది ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జట్టు కట్టబోతుండడం చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెలతో కూడా చిరంజీవి ఓ సినిమా చేయబోతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అయితే శ్రీకాంత్ ఇప్పుడు నానితో ‘పారడైజ్’ చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాని శరవేగంగా పూర్తి చేసి తరవాతే చిరు సినిమా చేయనున్నాడు. ఇక వీళ్లతో పాటు వెంకీ అట్లూరి కూడా చిరంజీవికి ఓ కథ వినిపించారని సమాచారం అందుతోంది. బాబీ, శ్రీకాంత్ ఓదెల తరవాత వెంకీ అట్లూరితో చిరంజీవి సినిమా చేయనున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కాగా, వెంకీ భాస్కర్ ఈ మధ్య `లక్కీ భాస్కర్`తో ఓ సూపర్ హిట్ కొట్టారు వెంకీ అట్లూరి. ఇప్పుడు సూర్యతో సినిమా చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుండగా, ఆ మూవీ తర్వాత చిరంజీవితో సినిమాకి సంబంధించిన కసరత్తులు చేసుకోనున్నాడట. మొత్తానికి చిరు కుర్ర హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్ సెట్ చేసి మంచి హిట్ కొట్టాలని అనుకుంటున్నాడట.