Chiranjeevi | ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అభిమానులతో పాటు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ముందు రోజే చాలా ఎమోషనల్గా తన అన్నయ్యకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలో చిరంజీవి చాలా సంతోషిస్తూ..తమ్ముడికి ప్రేమతో ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు! తమ్ముడు కల్యాణ్…ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి.
ప్రతీ మాట.. ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను. నీ కార్యదీక్షత, పట్టుదల చూసి ప్రతీ క్షణం గర్వపడుతూనే ఉన్నా. నిన్ను నమ్మినవాళ్లకు ఏదో చేయాలన్న తపనే నీకు ఎప్పటికప్పుడు కొత్త శక్తిని ఇస్తుంది. ఈ రోజు నీ వెనుక కోట్లాదిమంది జనసైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. అభిమానుల ఆశీర్వాదం, ప్రేమ నీకు మెండుగా లభిస్తూనే ఉండాలి. ఓ అన్నయ్యగా నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి. నీ ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటున్నాను అని చిరు పోస్ట్ పెట్టారు.
ఇక చిరంజీవి బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పేరు మీద పలు సేవా కార్యాక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైను చిత్ర నిర్మాతలు మెగాస్టార్ అభిమానుల కోసం పలు సర్ప్రైజ్లు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి- అనీల్ రావిపూడి మూవీ టైటిల్ మరి కొద్ది నిమిషాలలో రివీల్ చేయనున్నారు. అలానే చిరు-బాబీ కాంబోలో రూపొందనున్న ప్రాజెక్ట్ అప్డేట్ సాయంత్రం ఇవ్వనున్నారు. ఈ రోజు అంతా కూడా మెగా మానియాలో సినీ ప్రియులు తడిసి ముద్దవ్వడం ఖాయం.