Chiranjeevi | పిఠాపురంలోని చిత్రాడలో నిర్వహించిన జనసేన జయకేతనం సభలో పవన్ కళ్యాణ్ తన స్పీచ్‌తో అదరగొట్టారు. అచ్చమిల్లై.. అచ్చమిల్లై అంటూ సాగే పాటను పాడిన పవన్ తనకు భయం లేదు.. భయం లేదు.. అంటూ తన ధైర్యానికి కారణాన్ని పేర్కొన్నారు. ఇల్లేమో దూరం.. చేతిలో దీపం లేదు.. గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాడిని కనుకే.. అన్నీ ఒక్కడినై.. 2014 లో జనసేన పార్టీ స్థాపించాను. భావ తీవ్రత ఉంది కాబట్టే 2018 లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019 లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాను. మనం నిలబడ్డాం. పార్టీని నిలబెట్టాం.
మనం నిలదొక్కుకోవడమే కాకుండా.. నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మేలేశారు, జబ్బలు జరిచారు, తొడలు కొట్టారు. మన ఆడపడుచులను అవమానించారు. ప్రజలను హింసించారు. ఇదేమి న్యాయం అని మన జనసైనికులు, వీర మహిళలు గొంతెత్తితో వారిపై కేసులు పెట్టి జైళ్లల్లో పెట్టారు. ఈ ఎన్నికలో అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి తొడలు గొట్టినవారికి బుద్ధి వచ్చేలా ఆ గేట్లను బద్దలు కొట్టాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలతో అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా వంద శాతం స్ట్రైక్ రేట్‌తో ఘన విజయం సాధించాం. అని పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు.
ఇక పవన్ స్పీచ్‌కి చాలా మంది అట్రాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా టీవీలో పవన్ స్పీచ్ చూసి తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఇక పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడి స్పీచ్ ఇలా అయిందో లేదో వెంటనే ఎక్స్ ఖాతా నుంచి పోస్ట్ వదిలాడు. “మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అంటూ చేసిన ఈ పోస్ట్ ఇపుడు నెట్టింట వైరల్‌గా మారింది. చిరు ట్వీట్‌తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.