Chiranjeevi | చిరంజీవి ఎంత గొప్ప సూపర్‌స్టారో అంతగొప్ప ఫ్యామిలీ పర్సన్ కూడా. కుటుంబాన్ని అమితంగా ప్రేమిస్తారాయన. ముఖ్యంగా తన సతీమణి సురేఖకు ఆయనిచ్చే గౌరవం నిజంగా అభినందనీయం. నేడు సురేఖ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన శ్రీమతిపై ఉన్న ప్రేమను కవిత రూపంలో వ్యక్తం చేశారు చిరంజీవి. ‘నా జీవన రేఖ.. నా సౌభాగ్య రేఖ.. నా భాగస్వామి సురేఖ.. హ్యాపీ బర్త్‌డే’ అంటూ ప్రత్యేకంగా ఓ కవిత రాసి, సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారాయన.
అంతేకాదు, ఆమెతో కలిసి దిగిన ఓ ఫొటోను కూడా ఈ పోస్ట్‌కి జత చేశారు. ఇక ఆ పోస్ట్ సోషల్‌మీడియాలో ప్రత్యక్షమైన దగ్గర్నుంచి సురేఖకు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. కొందరు అభిమానులైతే ఆ కవితను స్క్రీన్‌షాట్స్ తీసుకొని పోస్ట్ చేస్తున్నారు. కొందరేమో చిరంజీవి దంపతుల పిక్‌ని పోస్ట్ చేస్తున్నారు.
మరోవైపు.. అత్తగారి పుట్టినరోజును పురస్కరించుకొని కోడలు ఉపాసన.. ‘అత్తమ్మ కిచెన్’ పేరుతో ఫుడ్ బిజినెస్ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ప్రొడక్ట్ ప్యాకెట్లను కూడా సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఏదిఏమైనా సురేఖకు ఇది గుర్తుంచుకోదగ్గ పుట్టినరోజు అని, అటు భర్త నుంచి ఇటు కోడలి నుంచి ఊహించని బహుమతులు అందుకోవడం నిజంగా ఆనందించదగ్గ విషయమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం సతీసమేతంగా చిరంజీవి అమెరికాలో ఉన్నారు. పద్మవిభూషణ్ అందుకున్న తర్వాత పరిశ్రమనుంచి, అభిమానుల నుంచి వెల్లువెత్తిన అభినందనల తాకిడిని అనుభవించిన చిరంజీవి.. కాస్త విశ్రాంతి కోసం భార్యతో కలిసి అమెరికా వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొంటున్నారని సమాచారం.