Chiranjeevi – Anil Ravipudi | టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. ఎన్టీఆర్-రామ్ చరణ్ కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చారు. మహేష్ బాబు-వెంకటేశ్, పవన్ కళ్యాణ్ – వెంకటేశ్ వంటి కాంబోలో కూడా మల్టీ స్టారర్ చిత్రాలు రాగా,ఈ చిత్రాలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇప్పటివరకు టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు ఒకే స్క్రీన్ మీద కనిపించే అవకాశం రాలేదు.ఈ నేపథ్యంలో చిరంజీవి – బాలకృష్ణల మల్టీ స్టారర్ గురించి దర్శకుడు అనిల్ రావిపూడి స్పందించారు. చిరంజీవితో చేస్తున్న కొత్త చిత్రం ‘మా శివశంకర వరప్రసాద్ గారు’ టైటిల్ గ్లింప్స్ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్, మీడియాతో ముచ్చటిస్తూ చిరు – బాలయ్య మల్టీ స్టారర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇద్దరు పెద్ద స్టార్ హీరోల్ని ఒకే ఫ్రేమ్‌లో చూపించాలంటే, అది సాధారణ విషయం కాదు. వారి స్థాయికి తగిన, బలమైన కథ దొరికితే నాతోపాటు వాళ్లు కూడా చేయడానికి రెడీగా ఉంటారు” అని అనీల్ చెప్పారు. అనీల్ ప్రస్తుతం చిరుతో సినిమా చేస్తుండగా, ఇందులో వెంకటేశ్ ఒక గెస్ట్ రోల్ చేస్తున్నారని టాక్ బయటకు వచ్చింది. అయితే అది కేవలం ఒక గెస్ట్ రోల్ మాత్రమే కాకుండా, చిరుతో కాంబినేషన్ లో కూడా కొన్ని సీన్లు కూడా ఉంటాయని సమాచారం. అంటే చిరు – వెంకీ ఓకే స్క్రీన్‌పై కనిపించబోతున్నారు. ఈ వార్త ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చింది.
మరోవైపు బాలకృష్ణతో భగవంత్ కేసరి వంటి విజయవంతమైన సినిమా చేసిన అనీల్ రావిపూడికు సీనియర్ హీరోలతో మంచి సంబంధం ఉంది. దర్శకుడిగా ఈయన మీద వాళ్లకు నమ్మకమూ ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో చిరు – బాలయ్యలతో ఒక పక్కా మల్టీ స్టారర్ చేయడం అసాధ్యమేమీ కాదు. టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రం చిరంజీవి – బాలయ్యల మల్టీ స్టారర్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇద్దరూ ఒకే తెరపై కనిపిస్తే… ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్లో రావడం ఖాయం.