Chiranjeevi | ఒకప్పుడు సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే ఓం పండుగలా జరిగేది. సంగీత దర్శకుడు, గీత రచయిత, దర్శకుడు, నిర్మాత, గాయనీగాయకులు, హీరో.. ఇలా అందరూ కూర్చొని ఒకరి అభిప్రాయాలను ఒకరు పంచుకుంటూ మంచి ఆల్బమ్ వచ్చే వరకూ కసరత్తులు చేసేవారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. సంగీతం, సాహిత్యం అన్నీ ఫోన్లలోనే వినడం, ఫోన్లోనే ఓకే చేయడం. అయితే.. ‘విశ్వంభర’ టీమ్ ఈ పద్ధతికి పుల్‌స్టాప్ పెట్టి, పాత విధానానికి శ్రీకారం చుట్టింది. బెంగళూరులోని కీరవాణి ఫామ్‌హౌస్‌లో చిరంజీవి, కీరవాణి, దర్శకుడు వశిష్ఠ, గీత రచయిత చంద్రబోస్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అంతా కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్‌లో కూర్చుని అద్భుతమైన ఆల్బమ్‌ని రాబట్టేందుకు కృషి చేస్తున్నారు.
షూటింగ్‌కి బ్రేక్ రావడంతో ఈ సమయాన్ని మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం వాడుకుంటున్నారు మూవీ టీమ్. వారంరోజుల పాటు వీరంతా అక్కడే ఉండి ‘విశ్వంభర’ పాటల పనిపట్టి తిరిగొస్తారట. చిరంజీవి నటించిన ఘరానామొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్పీ పరశురామ్ చిత్రాలకు కీరవాణి స్వరాలందించారు. మ్యూజికల్‌గా మూడు సినిమాలూ ఆకట్టుకున్నాయి. ‘విశ్వంభర’ నాలుగో సినిమా. ఎలాగైనా మంచి పాటలు ఇవ్వడానికి కీరవాణి మనసుపెట్టి పనిచేస్తున్నారు. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.