Bala Krishna | 90లలో స్టార్ హీరోలుగా చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున, వెంకటేష్ ఉన్నారు. వారి సినిమాలకి ప్రేక్షకులలో మంచి ఆదరణ ఉండేవి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ని చిరు, బాలకృష్ణ ఎక్కువగా అలరించేవారు. సంక్రాంతి సమయంలో ఈ ఇద్దరి హీరోల పోటీ మాములుగా ఉండేది కాదు.అప్పుడు మొదలైన ఈ వార్ 2023 సంక్రాంతికి వీరనరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య వరకు కొనసాగింది. మధ్యలో ఈ ఇద్దరు హీరోలు మధ్య చిన్న చిన్న మనస్పర్థలు వచ్చిన కూడా వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఇప్పటికీ మంచి రిలేషన్స్ ఉన్నాయి. అయితే అప్పట్లో ఇద్దరి మధ్య పోటీ పీక్స్‌లో ఉన్నా కూడా బాలకృష్ణ సినిమాని చిరంజీవి ప్రచారం చేయడం ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది
బాలకృష్ణ కెరీర్లో అద్భుత కళాఖండంగా నిలిచిన చిత్రం ఆదిత్య 369.. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో రూపొందిన ఈ చిత్రం అప్పటి ప్రేక్షకులకి సరికొత్త అనుభూతిని పంచింది. అయితే ఈ సినిమా సమయంలో నిర్మాతలు కాస్త అయోమయానికి గురయ్యారట. సినిమాలో కృష్ణకుమార్ పాత్ర ఎవరు పోషించినా ఫర్వాలేదు గానీ శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య ఒప్పుకోకపోతే ఆపేయాలని నిర్మాతలు అనుకున్నారట. శ్రీకృష్ణదేవరాయలు పాత్రకు యన్టీఆర్ నటవారసుడైన బాలకృష్ణ మాత్రమే న్యాయం చేయగలరని అందరూ భావించి బాలయ్యని అడగ్గానే ఆయన మరోమాట లేకుండా సినిమాను అంగీకరించారు.
సినిమా తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్‌ని మరింత పెంచేందుకు గాను మెగాస్టార్ చిరంజీవితో ప్రమోషన్ చేస్తే బాగుంటుందనుకుని నిర్మాతలు భావించారు. ఈ క్రమంలో చిరంజీవిని కలిసి విషయం చెప్పగా సరే అన్నారు. ‘ ఈ సినిమా తెలుగువారికే గర్వకారణం. అందరూ చూసి ఆనందించండి’ అంటూ చిరంజీవి ఇచ్చిన పిలుపు సినిమాకు కననక వర్షం కురిసింది. ఇక ఈ విషయాన్ని అయితే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ చాలా గొప్పగా చెప్పుకునే వారు. 34 ఏళ్ళ క్రితం తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసిన ‘ఆదిత్య 369’ సినిమా ఏప్రిల్ 4వ తేదీన రీ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాని ఇప్పటి సాంకేతిక హంగులతో మరింత గొప్ప అనుభూతిని అందించేలా ముస్తాబు చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్లాన్ చేస్తున్నారు.