Chinmayi | కొన్నిసార్లు అభిమానం హద్దులు దాటితే అది అభిమానంగా కాకుండా వేధింపుగా మారుతుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో కొంతమంది అభిమానుల ప్రవర్తనపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు ఇలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది. ఆమెను చుట్టుముట్టిన అభిమానులు తోసేసుకుంటూ హీరోయిన్‌పైకి ఎగబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న హారర్ కామెడీ థ్రిల్లర్ ‘రాజాసాబ్’లో ముగ్గురు హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ చిత్రంలోని ‘సహన సహన’ పాటను బుధవారం (డిసెంబర్ 17) విడుదల చేశారు.
ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని లూలూ మాల్లో సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు నిధి అగర్వాల్‌తో పాటు మరో హీరోయిన్ రిధి కుమార్ కూడా హాజరయ్యారు. సాంగ్ లాంచ్ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. ఈవెంట్ జరుగుతున్నంతసేపూ స్టేజ్ ముందు గుమిగూడిన అభిమానులు తోసుకుంటూనే కనిపించారు. అయితే ఈవెంట్ ముగిసిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారింది. నిధి అగర్వాల్ బయటకు వెళ్లే సమయంలో ఒక్కసారిగా అభిమానులు ఆమెపైకి ఎగబడారు. తోసుకుంటూ ముందుకు రావడం, చేతులు వేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సెక్యూరిటీ సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో చివరికి నిధి అగర్వాల్ కారులోకి ఎక్కగలిగింది. కారులో కూర్చోగానే ఆమె “ఓ మై గాడ్” అంటూ షాక్‌కు గురైన దృశ్యాలు వీడియోల్లో కనిపిస్తున్నాయి.
ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. కనీస కామన్ సెన్స్ లేకుండా అభిమానులు ప్రవర్తించారని మండిపడుతున్నారు. ఇది అభిమానమేం కాదని, పూర్తిగా టాక్సిక్ ఫ్యాన్ బిహేవియర్ అని వ్యాఖ్యానిస్తున్నారు. హీరోయిన్ను ఫిజికల్‌గా వేధించడమేనని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.దీనిపై సింగర్ చిన్మయి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీళ్లు మగాళ్లు కాదు, జంతువులు.జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి మానవ మృగాళ్లని వేరే గ్రహానికి పంపాలంటూ ఫైర్ అయింది. ఇదిలా ఉండగా, ప్రభాస్ నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమా 2026 సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 9న థియేటర్లలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.