Chinmayi | సీనియర్ నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మహిళలు ఎలా దుస్తులు ధరించాలన్న అంశంపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాతో పాటు ఇండస్ట్రీలోనూ పెద్ద చర్చకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండించగా, సింగర్ చిన్మయి శ్రీపాద ఈ విషయంలో గట్టిగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ముందుకొచ్చారు. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛపై ఎవరికీ ఆంక్షలు విధించే హక్కు లేదని చిన్మయి స్పష్టం చేస్తున్నారు. మహిళల డ్రెస్సింగ్‌ను నేరాలతో ముడిపెట్టడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ, న్యూస్ ఛానల్స్ డిబేట్స్‌లోనూ తన వాయిస్‌ను గట్టిగా వినిపిస్తున్నారు. పద్ధతిగా చీర కట్టుకున్న మహిళలపై, చిన్న పిల్లలపై కూడా దాడులు జరుగుతున్న సందర్భాలను ప్రస్తావిస్తూ, సమస్య దుస్తుల్లో కాదని… ఆలోచనల్లోనుందని చిన్మయి పేర్కొన్నారు.
అయితే ఈ వివాదంలో శివాజీకి మద్దతుగా నిలుస్తున్న కొందరు నెటిజన్లు, సినీ ప్రముఖులు చిన్మయిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఫేమ్ శేఖర్ బాషా రంగంలోకి దిగారు. శివాజీకి మద్దతుగా మాట్లాడిన ఆయన, మహిళా హక్కులపై మాట్లాడే నైతిక హక్కు చిన్మయి, అనసూయలకు లేదంటూ వ్యాఖ్యానించారు. గతంలో ఇండస్ట్రీ పెద్దలు మహిళలను కించపరిచేలా మాట్లాడినప్పుడు వీరు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. అంతేకాదు, చిన్మయి పాడిన కొన్ని పాటలను ప్రస్తావిస్తూ ఆమెపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా ‘రోబో’ సినిమాలోని ‘కిలిమంజారో’ పాటలో ఉన్న డబుల్ మీనింగ్ లైన్స్‌ను గుర్తుచేస్తూ, అప్పట్లో అవి అసభ్యంగా అనిపించలేదా అని నిలదీశారు. డబ్బుల కోసం ఎంత నీచానికైనా దిగజారే రకాలంటూ శేఖర్ బాషా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.
చిన్మయికి శేఖర్ బాషా గట్టి కౌంటర్ ఇచ్చాడంటూ ఓ వర్గం నెటిజన్లు వీడియోలను వైరల్ చేయడంతో అనుకోకుండా ‘కిలిమంజారో’ సాంగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది. అయితే ఈ విమర్శలకు చిన్మయి తనదైన శైలిలో స్పందించారు. తాజాగా ఆమె ‘కిలిమంజారో’ తమిళ్ వెర్షన్‌ను వ్యంగ్యంగా పాడుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోపై ఓ నెటిజన్ “బయట కొట్టుకుంటున్నారు… నువ్వు హ్యాపీగా పాటలు పాడుకో” అని కామెంట్ చేయగా, చిన్మయి వెంటనే స్పందిస్తూ, “ఎవడి చావు వాడు చస్తాడు… నాకేంది” అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, శివాజీ వ్యాఖ్యల వివాదానికి మరో కొత్త మలుపు తిప్పింది.