Child Artist Ravi Rathod | ‘విక్రమార్కుడు’ చిత్రంలో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్‌తో సుపరిచితమైన చైల్డ్ ఆర్టిస్ట్ రవి రాథోడ్ (Ravi Rathod) ఇటీవల దుర్భర జీవితాన్ని గడుపుతున్నవిషయం తెలిసిందే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా 25కు పైగా సినిమాల్లో నటించిన రవి రాథోడ్ ఆ తర్వాత అవకాశాలు లేక వ్యక్తిగత సమస్యల కారణంగా మద్యానికి బానిసై, సెట్ వర్కర్‌గా జీవనం సాగిస్తున్నాడు. అతడి పరిస్థితి తెలుసుకున్న నటుడు, దర్శకుడు లారెన్స్ రవిని దత్తత తీసుకుని స్కూల్లో చేర్పించగా.. స్కూల్ నుంచి పారిపోయాడు రవి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న రవి.. తన పరిస్థితి గురించి వివరిస్తూ.. లారెన్స్ నాకు చాలా చేశాడు స్కూల్‌కి కూడా పంపించాడు. కానీ నేనే పారిపోయి వచ్చాను. ఇప్పుడు నన్ను చూస్తే కొడతాడు అంటూ మాట్లాడాడు. అయితే రవి మాట్లాడిన వీడియో చివరికి లారెన్స్ వరకు చేరింది. దీంతో రవి పరిస్థితిని చూసి చలించిపోయిన రాఘవ లారెన్స్ రవిని ఉద్దేశించి మాట్లాడుతూ.. రవి.. నువ్వు పారిపోయినందుకు నేను తిట్టను, కొట్టను. దయచేసి నువ్వు వచ్చి నన్ను కలువు. నిన్ను ఇలా చూసి నా గుండె తరుక్కుపోతోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే లారెన్స్ పిలుపు మేరకు రవి రాథోడ్ చెన్నై వెళ్లి ఆయనను కలిసినట్లు తెలుస్తుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోను రవి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.
మరోవైపు రవి రాథోడ్ పరిస్థితి చూసిన లారెన్స్ అతనిపై కోపం చూపకుండా ఆప్యాయంగా మాట్లాడినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా రవి రాథోడ్ మద్యపాన వ్యసనం నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించబోతున్నట్లు సమాచారం.