Chhaava Movie | బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన ‘ఛావా’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. కేవలం హిందీలోనే రూ.450 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమాను తాజాగా తెలుగులో విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ గీతా ఆర్ట్స్ బ్యానర్ ఈ సినిమాను తెలుగులో మార్చి 07న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.
హిందీలో భారీ విజయం దక్కించుకున్న ఈ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీంతో తెలుగులో కూడా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. రిలీజైన కేవలం నాలుగు రోజుల్లోనే 10.91 కోట్లు వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. మరోవైపు ఈ విజయం బాలీవుడ్ చిత్రాల తెలుగు వెర్షన్లకు కొత్త ఊపిరి పోస్తుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో విక్కీ కౌశల్ శంభాజీ మహారాజ్‌గా నటించగా.. అతడి భార్య యేసుబాయి పాత్రలో రష్మిక మంధన్నా నటించింది. మొగల్ చక్రవర్తి ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నటించారు.