ఆసార్ అవార్డుకు గుర్తింపుగా నిర్మించిన ఆసార్ గ్రంథాలయంతో చల్లగరిగ చదువుల్లో వెలుగొందనున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఆసార్ అవార్డు పొందిన అనంతరం గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం సినీ గేయ రచయిత చంద్రబోస్ సుమారు రూ.40లక్షల సొంత నిధులతో రెండంతస్తుల గ్రంథాలయాన్ని అతడి తల్లి మధునమ్మ జ్ఞాపకార్థంగా నిర్మించాడు. గురువారం చంద్రబోస్, అతడి కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే గ్రంథాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. పుట్టిన ఊరి కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గొప్ప వ్యక్తి చంద్రబోస్ అని అన్నారు.
చంద్రబోస్ తన చిన్నతనంలో ఇదే స్థలంలో ఉన్న పాత గ్రంథాలయంలోనే చదువుకొని ఈ రోజు ఇంత గొప్పస్థాయికి ఎదిగారని అన్నారు. చదువుతోనే ఏదైనా సాధించవచ్చని, చదువు వల్లనే చంద్రబోస్ ఈ రోజు ప్రపంచస్థాయి ఆసార్ గుర్తింపు పొందినట్లు తెలిపారు. విద్యార్థులు బోస్‌ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. తన వంతుగా గ్రంథాలయం కోసం రూ.10 లక్షలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే సభాముఖంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి తూర్పాటి శ్రీలత, జీపీ స్పెషల్ ఆఫీసర్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, అభిమానులు పాల్గొన్నారు.