Champion | సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు, యువ హీరో రోషన్ మేక ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఛాంపియన్’ థియేటర్లలో మిక్స్డ్ స్పందన అందుకున్నప్పటికీ ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి హడావుడి ముగిసిన తర్వాత ఓటీటీ ఎంట్రీకి సిద్ధమైంది.ప్రముఖ అంతర్జాతీయ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకోగా, ఈ సినిమా ఈ జనవరి 29 నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. హిందీ మినహా అన్ని దక్షిణాది భాషల్లో ఈ సినిమా రానున్నట్టు మేకర్స్ తెలియజేశారు. థియేటర్లో మిస్ అయిన వారు ఈ నెల 29 నుండి ఓటీటీలో చూడొచ్చు. మరోవైపు, టెలివిజన్ హక్కులను జీ తెలుగు సొంతం చేసుకోవడంతో ఓటీటీ రిలీజ్ అనంతరం ఈ చిత్రం బుల్లితెరపై ప్రసారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ సినిమాకు ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించగా, రోషన్‌కు జోడీగా అనస్వర రాజన్ నటించారు. కల్యాణ్ చక్రవర్తి, అర్చన, కోవై సరళ, హర్షవర్ధన్, నరేష్, వెన్నెల కిషోర్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో కనిపించారు. జీ స్టూడియోస్ సమర్పణలో స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కింది. స్వప్న దత్ నిర్మాతగా వ్యవహరించగా, మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. కథ పరంగా చూస్తే, ఇది 1947 స్వాతంత్య్రా నంతర కాలంలో నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం నేపథ్యంగా సాగుతుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా, తెలంగాణ ప్రాంతం మాత్రం రజాకార్ల అఘాయిత్యాలతో అల్లాడుతున్న రోజుల్లో కథ మొదలవుతుంది. ప్రజలను బానిసలుగా చూసే పాలనకు ఎదిరిస్తూ భైరాన్‌పల్లి గ్రామస్తులు ధైర్యంగా నిలబడతారు. అదే సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ యువకుడు మైఖేల్ సి విలియమ్స్ ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎదిగి, ఇంగ్లాండ్‌లో ఆడే అవకాశం దక్కించుకుంటాడు. కానీ కుటుంబ నేపథ్యం కారణంగా అతని కలలకు అడ్డంకులు ఎదురవుతాయి.
ఇంగ్లాండ్ వెళ్లే మార్గం మూసుకుపోవడంతో, అక్రమ మార్గాన్ని ఆశ్రయించిన మైఖేల్ అనుకోకుండా భైరాన్‌పల్లి చేరుకుంటాడు. అక్కడి ప్రజల పోరాటం, రజాకార్ల క్రూరత్వం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. యుద్ధానికి దూరంగా ఉండాలనుకున్న యువకుడు చివరకు రజాకార్లకు ఎదురుగా నిలవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బాబు దేశ్ ముఖ్‌తో అతనికి ఏర్పడిన శత్రుత్వం ఏమిటి? గ్రామ నాయకుడు రాజి రెడ్డి పాత్రలో కల్యాణ్ చక్రవర్తి చేసిన త్యాగం ఏంటి? అన్న అంశాలు కథను ఆసక్తికరంగా ముందుకు నడిపిస్తాయి.థియేటర్లలో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, చారిత్రక నేపథ్యం, యాక్షన్, ఎమోషన్ కలబోతగా తెరకెక్కిన ‘ఛాంపియన్’ ఓటీటీలో కొత్త ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది.