Champion | యంగ్ హీరో రోషన్ మేక హీరోగా నటించిన లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘ఛాంపియన్’ బాక్సాఫీస్ వద్ద నిలకడగా పరుగులు పెడుతోంది. విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, ఆ తర్వాత వర్డ్ ఆఫ్ మౌత్‌తో కలెక్షన్లు మెరుగుపడ్డాయి. మూడు రోజుల్లోనూ డీసెంట్ వసూళ్లు సాధిస్తూ సినిమాపై మంచి బజ్ కొనసాగుతోంది. మూవీ టీం వెల్లడించిన వివరాల ప్రకారం, ‘ఛాంపియన్’ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.8.89 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా “ఛాంపియన్ థియేటర్లలో అదే జోష్ కొనసాగిస్తోంది” అంటూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా రూ.4.50 కోట్లు, రెండో రోజు రూ.2.40 కోట్లు రాబట్టిన సినిమా, మూడో రోజు కూడా అదే స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసింది. వీకెండ్ ముగిసేలోగా లేదా సోమవారం నాటికి రూ.10 కోట్ల మార్క్ దాటే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ చిత్రంలో రోషన్ సరసన అనస్వర రాజన్ హీరోయిన్గా నటించగా, వీరిద్దరికీ ఇదే తొలి సినిమా కావడం విశేషం. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో, ఒకప్పటి హీరో నందమూరి కల్యాణ్ చక్రవర్తి ‘రాజి రెడ్డి’ పాత్రలో ఆకట్టుకున్నారు. అలాగే అర్చన, కోవై సరళ, వెన్నెల కిశోర్, నరేష్, ప్రకాష్ రాజ్, రచ్చ రవి, హైపర్ ఆది, సంతోష్ ప్రతాప్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. జీ స్టూడియోస్ సమర్పణలో, స్వప్న సినిమాస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిలిం బ్యానర్లపై ఈ సినిమాను నిర్మించారు. నిర్మాతగా స్వప్న దత్ వ్యవహరించారు. సంగీతం మిక్కీ జే మేయర్ అందించగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి స్పందన వస్తోంది.
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ సంస్థానం నిజాం నిరంకుశ పాలనలో ప్రజలు భయంతో బతుకుతున్న కాలం నేపథ్యంలో కథ నడుస్తుంది. తెలంగాణలోని పల్లెలు రజాకార్ల దౌర్జన్యానికి గురవుతుండగా, బైరాన్‌పల్లి వంటి గ్రామాలు మాత్రం వీరోచితంగా ఎదురు నిలుస్తాయి. అదే సమయంలో సికింద్రాబాద్‌కు చెందిన ఆంగ్లో ఇండియన్ యువకుడు మైఖేల్ సి. విలియమ్స్ (రోషన్) ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎదుగుతాడు. తన ప్రతిభతో ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ ఫుట్‌బాల్ క్లబ్ తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నా, తండ్రి నేపథ్యం కారణంగా లీగల్‌గా వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుని, హైదరాబాద్ నుంచి బీదర్‌కు ఆయుధాలు తరలించే మిషన్‌లో భాగమవుతాడు. ఆ ప్రయాణంలో అతడు బైరాన్‌పల్లికి చేరడం, అక్కడి ప్రజలతో కలిసి రజాకార్లపై పోరాడటం, చంద్రకళతో అతడి అనుబంధం, చివరికి అతడు నిజంగా ‘ఛాంపియన్’ అయ్యాడా లేదా? అన్నదే ఈ చిత్ర కథ.