సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన క్రాంతి మాధవ్ దర్శకత్వంలో, యంగ్ హీరో చైతన్య రావు మదాడి జంటగా తెరకెక్కనున్న కొత్త చిత్రం శుక్రవారం (అక్టోబర్ 3) దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. శ్రేయాస్ చిత్ర మరియు పూర్ణా నాయుడు ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ ప్రొడక్షన్ నెం. 5ను పూర్ణా నాయుడు, శ్రీకాంత్. వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఐరా మరియు బెంగాలీ సీరియల్స్ నటి సాఖీ హీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు దేవా కట్టా క్లాప్ కొట్టగా, కె ఎల్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నిర్మాతలు పూర్ణ నాయుడు, శ్రీకాంత్ కలిసి స్క్రిప్ట్‌ను అందజేశారు. తొలి సన్నివేశానికి వర ముళ్ళపూడి గౌరవ దర్శకత్వం వహించారు.
దర్శకుడు క్రాంతి మాధవ్ మాట్లాడుతూ…
“ఇది నా ఐదో చిత్రం, చైతన్యతో రెండో సినిమా. నిర్మాత పూర్ణ నాయుడుతో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ తర్వాత సినిమా చేయాలని అనుకున్నాం. నా గత చిత్రం ఫ్లాప్ అయి, ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పూర్ణ గారు వచ్చి సినిమా చేద్దామని ముందుకు వచ్చారు. వారి మద్దతు మరవలేనిది. ఇది న్యూ ఏజ్ లవ్ స్టోరీ. అందమైన లొకేషన్లలో ఈ మూవీని భారీగా చిత్రీకరించబోతున్నాం” అని తెలిపారు.
హీరో చైతన్య రావు మాట్లాడుతూ…
“నాకు ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చాలా ఇష్టమైన సినిమా. క్రాంతి అన్నతో నాకు మూడేళ్ల బంధం ఉంది. ఆయనతో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాను. 2026లోనే ఆయనతో చేస్తున్న రెండు సినిమాలు విడుదల కానున్నాయి. నాకు ఇంతకంటే ఎక్కువ ఏమీ వద్దు. ‘మయసభ’, ‘ఘాటీ’ తర్వాత ఇంత మంచి సినిమా చేస్తుండటం నా అదృష్టం. ఇదొక న్యూ ఏజ్ లవ్ స్టోరీ, కథ చాలా నచ్చింది. ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను” అని అన్నారు.
నిర్మాత పూర్ణ నాయుడు, హీరోయిన్ ఐరా ఏమన్నారంటే…
దర్శకుడు క్రాంతి మాధవ్‌ను తానే పరిచయం చేయాలనుకున్నానని, ఇన్నేళ్లకు కుదిరిందని నిర్మాత పూర్ణ నాయుడు చెప్పారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని అన్నారు. హీరోయిన్ ఐరా మాట్లాడుతూ.. తెలుగులోనే పరిచయం కావాలని అనుకున్నానని, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ సినిమాను దాదాపు 20 సార్లు చూశానని తెలిపారు. క్రాంతి మాధవ్ ఫోన్ చేయడంతో చాలా సంతోషించానని, ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం తన అదృష్టమని పేర్కొన్నారు.
ముఖ్య తారాగణం: చైతన్య రావు మదాడి, ఐరా, సాఖీ తదితరులు.
సాంకేతిక బృందం:
బ్యానర్స్: శ్రేయాస్ చిత్ర, పూర్ణ నాయుడు ప్రొడక్షన్స్
నిర్మాతలు: పూర్ణ నాయుడు, శ్రీకాంత్ వి
కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: క్రాంతి మాధవ్
సంగీతం: ఫణి కళ్యాణ్
సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్ V. S. ISC
ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా
డిజైనర్: ధని ఏలే