ఇటీవలే విడుదలైన ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రంలో వెంకన్న పాత్రలో పవర్ఫుల్ విలనీ పండించి అందరి దృష్టిని ఆకర్షించారు చైతన్య జొన్నలగడ్డ. అఖిల్‌రాజ్, తేజస్విని జంటగా నటించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శనివారం నటుడు చైతన్య జొన్నలగడ్డ విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో బబుల్గమ్, హిట్-3 వంటి చిత్రాల్లో నటించానని, అయితే ఆ సినిమాల్లో ఉన్నాననే విషయం కూడా ఎవరికీ తెలియదని, వెంకన్న పాత్ర మాత్రం అందరికి గుర్తుండిపోతుందని అన్నారు. ‘వెంకన్న పాత్ర కోసం చాలా కసరత్తులు చేశా.
ప్రత్యేకమైన దుస్తుల్ని ఎంపిక చేసుకున్నా. గడ్డం పెంచి నెత్తికి ఆయిల్‌తో చూడగానే భయపెట్టేలా తయారయ్యా’ అని చెప్పారు చైతన్య. తన సోదరుడు, హీరో సిద్ధు జొన్నలగడ్డ పేరును సినిమాల పరంగా ఎక్కడా ఉపయోగించుకోవడం ఇష్టం లేదని, ఇండస్ట్రీలో సొంతంగానే పేరు తెచ్చుకోవాలన్నదే తన అభిమతమని, అందుకే ఈ సినిమాకు సంబంధించిన ఏ ఈవెంట్‌కు సిద్ధుని ఆహ్వానించలేదని చైతన్య జొన్నలగడ్డ తెలిపారు.
‘నేను జీవితంలో సెటిల్ అయ్యాకే నటుడిగా ప్రయత్నాలు మొదలుపెట్టా. కాబట్టి ఏదో సాధించాలనే తొందరలేదు. బలమైన ఉద్వేగాలున్న క్యారెక్టర్ రోల్స్‌లో మెప్పించాలన్నదే నా లక్ష్యం. ప్రస్తుతం తెలుగులో పవన్ సాధినేని దర్శకత్వంలో రాజశేఖర్ చిత్రంతో పాటు, దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ చిత్రాల్లో నటిస్తున్నా’ అని చైతన్య జొన్నలగడ్డ తెలిపారు.