Megastar Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి సేవా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వేలాది మందికి ఆయన సహాయం అందించారు. అయితే ఆయన సేవాగుణం నుంచే ఉద్భవించినదే “చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్”. దాదాపు 27 ఏళ్లుగా ఈ సంస్థ ద్వారా బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ సేవలతో ఎంతో మంది రక్తం, నేత్రాలు పొంది పునర్జీవనం పొందుతున్నారు. కరోనా సమయంలో కూడా ఈ ట్రస్ట్ విశేష సేవలను అందించింది. అయితే, తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక శుభవార్తను ప్రకటించింది. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌ను ఎఫ్సీఆర్ఏ (FCRA – Foreign Contribution Regulation Act) కింద నమోదు చేసుకునేందుకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. దీనిద్వారా ఈ ట్రస్ట్ ఇకపై విదేశాల నుంచి కూడా విరాళాలు తీసుకునే వెసులుబాటును పొందింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ఎఫ్సీఆర్ఏ అనుమతి తప్పనిసరి చేయడంతో, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ చేసుకున్న అప్పీల్‌కు ప్రస్తుతం అనుమతి లభించింది.
ఇక సినిమాల విషయానికి వస్తే చిరంజీవి ప్రస్తుతం “మన శంకర వరప్రసాద్ గారు” చేస్తున్నారు. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తోంది. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.