Dasara Movie Censor | మరో వారం రోజుల్లో విడుదల కాబోతున్న దసరా సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. నాని తొలిసారి ఫుల్ ఫ్లెడ్జుడ్ మాస్ రోల్ చేయడంతో అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. దానికి తోడు సినిమా నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా ప్రతీది అంతకంతకూ అంచనాలు పెంచుతూనే ఉన్నాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో నాని అన్ని భాషల్లోనూ వరుస ప్రమోషన్లు జరుపుతూ సినిమాపై బజ్ తీసుకువస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. అయితే సెన్సార్ చిత్రబృందానికి పెద్ద షాక్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఈ సినిమాకు ఏకంగా 36 కట్స్ చెప్పింది. ఇంత మొత్తంలో కట్స్ పెట్టిన తొలి తెలుగు చిత్రంగా నయా రికార్డును దసరా క్రియేట్ చేసింది. ఆడియో మ్యూట్, డైలాగ్ కట్స్‌తో పాటు కొన్ని చోట్ల సబ్ టైటిల్స్‌లో టెక్స్ట్ కూడా తీసేయాలని సెన్సార్ బృందం తెలిపిందట. వాడుక భాషలోని కొన్ని పదాలు (బద్దల్ బాసింగలైతయ్, బాడకవ్) మ్యూట్ చేయాలని సెన్సార్ సభ్యులు చెప్పారట.
బొగ్గు గనుల నేపథ్యంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ను నిహారిక ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. నానికి జోడీగా కీర్తి సురేష్ నటించింది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగిందని సమాచారం. టాలీవుడ్లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం దసరా సినిమాకు అన్ని హక్కులకు కలిపి రూ.80 కోట్ల వరకు బిజినెస్ జరిగింది ఈ సినిమా బడ్జెట్ రూ.65 కోట్లు. ఈ లెక్కన చూసుకుంటే నిర్మాతలు ఆల్రెడీ రూ.15 కోట్ల ప్రాఫిట్లో ఉన్నట్టే.