Censor @ Besharam Rang | షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ చిత్రంలో కొన్ని సన్నివేశాలు, పాటలు మార్చనున్నారు. సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వచ్చిన అభ్యంతరాలను సెంట్రల్ బోర్డ్ ఫర్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) పరిశీలించింది. ఈ మేరకు గురువారం ఈ చిత్ర నిర్మాతలకు మార్పులు చేయాలంటూ కొన్ని సూచనలు ఇచ్చింది. పఠాన్ సినిమాలోని ‘బేషరమ్ రంగ్’ పాటపై వివాదాల నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ మార్పులు సూచించడం విశేషం.
‘ఈ సినిమా విడుదలకు ముందే చేపట్టిన సవరణలను సమర్పించాలని చిత్ర నిర్మాతలకు సూచించాం. సినిమాను నిశితంగా పరిశీలించిన తర్వాత సెన్సార్ బోర్డు పలు మార్పులను సూచించింది’ అని సీబీఎఫ్సీ చైర్పర్సన్ ప్రసూన్ జోషి తెలిపారు. సెన్సార్ బోర్డు ఎల్లప్పుడూ సృజనాత్మకత, ప్రేక్షకుల సున్నితత్వానికి మధ్య సమతుల్యతను పాటిస్తుందని అయన చెప్పారు. ఈ సినిమాను జనవరి 25న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు.
బేషరమ్ రంగ్ పాటలో నటి దీపికా పదుకొనే కాషాయ దుస్తుల్లో కనిపించింది. దాంతో వివాదం మొదలైంది. బేషరమ్ రంగ్ పాట వివాదాస్పదం కావడంతో ఈ చిత్రం ఫ్రీ పబ్లిసిటీని పొందినట్లయింది. కాగా, మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా, ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గిరీష్ గౌతమ్ ఈ పాటపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ సన్నివేశాలను మార్చకుండా విడుదల చేయడాన్ని ఒప్పుకోమని స్పష్టం చేశారు. ఐదేండ్ల విరామం తర్వాత పఠాన్ సినిమాతో మళ్లీ స్టార్డమ్ను అందుకోవాలని షారుఖ్ ఖాన్ ఎదురు చూస్తున్నారు.