UP CM Yogi Ajey | ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘అజయ్’ అనే సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ చిత్రానికి సర్టిఫికెట్ జారీ చేయడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జీవితం ఆధారంగా ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ‘అజయ్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఎ యోగి’ (Ajey: The Untold Story of a Yogi) అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు రవీంద్ర గౌతమ్ దర్శకత్వం వహిస్తుండగా.. యోగి పాత్రలో బాలీవుడ్ నటుడు అనంత్ జోషి యోగి కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో పరేష్ రావాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రముఖ రచయిత శాంతను గుప్తా రాసిన ‘ది మాంక్ హూ బికేమ్ చీఫ్ మినిస్టర్’ (The Monk Who Became Chief Minister) అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. ఈ సినిమాకు సర్టిఫికెట్ జారీ చేయడానికి సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఈ సినిమాకి సెన్సార్ ఇవ్వడం కుదరదని వెల్లడించింది. దీంతో ఈ చిత్ర దర్శక, నిర్మాతలు ముంబై హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం దీనిపై విచారణ జరుగబోతుంది.
అయితే ఈ పిటిషన్‌పై కోర్టు స్పందిస్తూ.. సెన్సార్ బోర్డును కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సినిమాకు ప్రేరణనిచ్చిన నవల ఎనిమిదేళ్లుగా ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. మరి అదే నవల ఆధారంగా తెరకెక్కిన సినిమాకు ఎందుకు అభ్యంతరాలు వస్తాయి.. సెన్సార్ ఎందుకు నిరకరించారో చెప్పాలంటూ సెన్సార్ బోర్టును హైకోర్టు ఆదేశించింది. సినిమాకు సెన్సార్ ఆలస్యం చేయడానికి గల కారణాలను వివరించాలని కోర్టు ఆదేశించింది. దీనిపై స్పందించిన బోర్డు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చింది.