Taraka Ratna | నందమూరి తారకరత్న పార్థీవదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఫిలించాంబర్‌లో ఉంచారు. తారకరత్నకు నివాళులర్పించేందుకు అభిమానులు, కుటుంబసభ్యులు, సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో ఫిలించాంబర్‌కు తరలివస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సినీ నటులు వెంకటేశ్, తరుణ్, సంగీత దర్శకుడు కోటితోపాటు పలువురు ప్రముఖులు తారకరత్న భౌతికకాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.
మంచి స్నేహితుడిని కోల్పోయా..

తారకరత్న ఆరోగ్యంగా తిరిగి వస్తాడని ఆకాంక్షించామని తరుణ్ అన్నాడు. సడెన్‌గా ఇలా జరుగడం బాధాకరం. తారకరత్న మరణం ఆయన కుటుంబంతోపాటు నాకు తీరని లోటు. మంచి స్నేహితుడిని కోల్పోయాను. తారకరత్న నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇద్దరం భారతీయ విద్యాభవన్లోనే చదువుకున్నాం. ఎప్పుడూ నవ్వుతూ అందరితో ఎంతో మర్యాదగా, ఫ్రెండ్లీగా ఉంటాడు. వ్యక్తిగతంగా మంచి స్నేహితుడిని కోల్పోయాను. ఆయన కుటుంబానికి నా ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నా.
తారకరత్న మృతి చాలా బాధాకరం..

మంత్రి తలసాని మాట్లాడుతూ.. తారకరత్న మృతి చాలా బాధాకరమన్నారు. 20వ ఏట చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన తారకరత్న 21కి పైగా చిత్రాల్లో నటించారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని ప్రార్ధించారు.
ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న గారి పార్థివ దేహానికి నివాళులర్పించి, నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించడం జరిగింది. pic.twitter.com/TMAHLJGSUu
— Talasani Srinivas Yadav (@YadavTalasani) February 20, 2023
మధ్యాహ్నం 3 గంటల వరకు ఫిలింఛాంబర్లో తారకరత్న పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర సాగనుంది. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలు జరగనున్నాయి.