Bala Krishna | ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ జన్మదినం సందర్భంగా టీడీపీ నేతలు, బాలయ్య అభిమానులు పండుగలా ఆయన జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. రక్తదానాలు, రోడ్డు షోలు నిర్వహిస్తూ బాలయ్యపై అభిమానం చాటుకుంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు తన సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు… నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ బాలకృష్ణకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సిల్వర్ స్క్రీన్‌పై ఆయన లెజెండ్.. పొలిటికల్ స్క్రీన్‌పై ఆయన అన్‌స్టాపబుల్.. ప్రజల గుండెల్లో ఆయన బాలయ్య.. నా ముద్దుల మావయ్య’ అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు లోకేష్.
ఇక బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా తిరుమలలో ఘనంగా బాలకృష్ణ వేడుకలు నిర్వహిస్తున్నారు. శ్రీవారి ఆలయ అఖిలాండం వద్ద 650 టెంకాయలు కొట్టి.. 6.5 కిలోల కర్పూరాన్ని వెలిగించి టీడీపీ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ మొక్కులు చెల్లించుకున్నారు. బాలకృష్ణ జన్మదినం సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండటంతో పాటు ప్రజలకు మరింత సేవ చేయాలని స్వామి వారిని ప్రార్ధించి మొక్కులు చెల్లించుకున్నామని శ్రీధర్ వర్మ పేర్కొన్నారు. కాగా, బాలయ్య ప్రస్తుతం బోయపాటి శీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదల కాగా, ఈ టీజర్ మూవీపై భారీ అంచనాలే పెంచింది.