Censor Board | గాజా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన ఐదేళ్ల పాలస్తీనా బాలిక హింద్ రజబ్ వాస్తవ గాథ ఆధారంగా రూపొందిన ‘ద వాయిస్ ఆఫ్ హింద్ రజబ్’ (The Voice of Hind Rajab) చిత్రానికి ఇండియన్ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ నిరాకరించడం
రాజకీయంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సిల్వర్ లైన్’ అవార్డును గెలుచుకోవడమే కాకుండా, ఆస్కార్‌కు నామినేట్ అయి అంతర్జాతీయంగా ప్రశంసలు పొందిన ఈ సినిమాను భారత్‌లో విడుదల చేసేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) అడ్డంకులు సృష్టిస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమాను ప్రదర్శిస్తే భారత్ మరియు ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉన్న దౌత్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని సెన్సార్ బోర్డు సభ్యులు మౌఖికంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు చిత్ర పంపిణీదారుడు మనోజ్ నంద్వానా పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సహా పలువురు నేతలు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌కు లేఖ రాశారు. ఒక చిన్నారి గాథను వెండితెరపై చూపే విషయంలో విదేశీ సంబంధాలను సాకుగా చూపడం భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమేనని వారు వాదించారు. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్ర దేశాల్లో విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రంపై భారత్‌లో ఆంక్షలు విధించడం సరికాదని, తక్షణమే కేంద్ర మంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకుని సినిమా విడుదలకు మార్గం సుగమం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కథ విషయానికి వస్తే.. ఈ చిత్రం హింద్ రజబ్ అనే ఆరేళ్ల పాలస్తీనా బాలిక చుట్టూ తిరుగుతుంది. 2024 జనవరిలో గాజాపై దాడులు జరుగుతున్న సమయంలో, తన ప్రాణాలను కాపాడుకోవడానికి హింద్ తన బంధువులతో కలిసి ఒక కారులో సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, దారి మధ్యలో వారు ప్రయాణిస్తున్న కారు ఇజ్రాయెల్ ట్యాంకుల దాడికి గురవుతుంది. కారుపై జరిగిన కాల్పుల్లో హింద్ బంధువులందరూ అక్కడికక్కడే మరణిస్తారు. కేవలం హింద్ మాత్రమే ప్రాణాలతో మిగులుతుంది. చుట్టూ తన వారి మృతదేహాల మధ్య, బయట ట్యాంకుల భయంకరమైన శబ్దాల మధ్య ఆ చిన్నారి కారులో చిక్కుకుపోతుంది. కారులో ఉన్న ఫోన్ ద్వారా హింద్ పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ (PRCS) కి ఫోన్ చేసి సహాయం కోరుతుంది. “నన్ను తీసుకెళ్లండి.. నాకు చాలా భయంగా ఉంది” అంటూ ఆమె చేసిన ఫోన్ కాల్ ఆడియో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. సుమారు 3 గంటల పాటు ఆమె భయంతో వణుకుతూ సహాయం కోసం ఎదురుచూసింది. అయితే హింద్‌ను రక్షించడానికి వెళ్లిన ఇద్దరు పారామెడికల్ సిబ్బంది కూడా దాడికి గురై అదృశ్యమవుతారు. ఇక దాదాపు 12 రోజుల తర్వాత, ఆ కారు ఆనవాళ్లు లభ్యమవుతాయి. అందులో హింద్ తో పాటు ఆమె బంధువులు, ఆమెను రక్షించడానికి వెళ్లిన సిబ్బంది అందరూ మరణించి కనిపిస్తారు.