Naa Anveshana | ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలోని ఉన్నతాధికారులపై అన్వేష్ తప్పుడు ఆరోపణలు చేస్తూ, నిరాధారమైన సమాచారంతో వీడియోను ప్రచారం చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు మెట్రోలో బెట్టింగ్ యాప్‌ల ప్రకటనల కోసం రూ.300 కోట్లు అక్రమంగా వసూలు చేశారని అన్వేష్ తన యూట్యూబ్ వీడియోలో ఆరోపించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు తేల్చారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. అన్వేష్ వీడియో ప్రజల్లో గందరగోళం సృష్టించేలా, అధికారుల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చేసిన అన్వేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు తెలిపారు. ప్రపంచ యాత్రలతో యూట్యూబ్‌లో గుర్తింపు పొందిన అన్వేష్‌పై ఈ కేసు నమోదు కావడం చర్చనీయాంశమైంది.