Cannes | ప్రపంచ చలనచిత్ర వేడుకల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నేడు (మే 13) ఫ్రాన్స్‌లో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఉత్సవ నిర్వాహకులు రెడ్ కార్పెట్ కోసం కఠినమైన డ్రెస్ కోడ్‌ను అమలులోకి తెచ్చారు. ఇకపై రెడ్ కార్పెట్‌పై పూర్తిగా నగ్నంగా రావడం లేదా ఎక్కువ పరిమాణంలో ఉండే దుస్తులు ధరించడాన్ని నిషేధించారు. ఈ కొత్త నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని వారు స్పష్టం చేశారు.
ఈ నిషేధానికి ప్రధాన కారణం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఉన్న విశిష్టమైన గుర్తింపును కాపాడుకోవడమే అని తెలిపారు. రెడ్ కార్పెట్‌పై ఎవరైనా నగ్నంగా లేదా సభ్యత లేని దుస్తులతో వస్తే అది ఉత్సవం యొక్క ప్రతిష్టను దిగజారుస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారు. అంతేకాకుండా, భారీ దుస్తులు, ముఖ్యంగా పొడవాటి గౌన్లు, పెద్ద అలంకరణలు ధరించడం వల్ల రెడ్ కార్పెట్‌పై నడవడానికి, కూర్చోవడానికి ఇబ్బంది కలుగుతుందని. ఇది ఇతర అతిథులకు అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, భద్రతా సమస్యలకు కూడా దారితీయవచ్చని నిర్వాహకులు భావిస్తున్నారు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు కూడా ఈ కఠిన నిర్ణయం తీసుకోవడానికి ప్రేరణ కలిగించాయి. ఈ సంవత్సరం గ్రామీ అవార్డుల్లో బియాంకా సెన్సోరి దాదాపు నగ్నంగా కనిపించడం వంటి ఘటనలు ఈ నిబంధనలను మరింత కఠినతరం చేశాయి.
ఈ విషయంపై కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వాహకులు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు. “రెడ్ కార్పెట్‌పై పూర్తిగా నగ్నంగా ఉండటాన్ని, ఎక్కువ పరిమాణంలో ఉండే దుస్తులను అనుమతించకపోవడం మా విధానం. ఇది మా సంస్థాగత నియమాలకు, ఫ్రెంచ్ చట్టానికి అనుగుణంగా ఉంటుంది. మేము ఎవరి దుస్తుల శైలినో నియంత్రించాలనుకోవడం లేదు, కానీ అందరి మర్యాద, భద్రత కాపాడటం మా ముఖ్య లక్ష్యం” అని వారు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధనల వల్ల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పెట్ మరింత హుందాగా, క్రమశిక్షణగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ నిబంధనలు పాటించని వారిని రెడ్ కార్పెట్‌పైకి అనుమతించబోమని నిర్వాహకులు స్పష్టం చేశారు.