తెలుగు చలనచిత్ర నిర్మాతలమండలి ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్యానల్స్‌లో ఒకటైన ‘మన ప్యానల్’ సభ్యులు గురువారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్యానల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘నన్ను ప్యానల్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు ధన్యవాదాలు. నిర్మాతల సమస్యల గురించి బాలకృష్ణగారితో సానుకూలంగా మాట్లాడాం. ఇద్దరు ముఖ్యమంత్రులనూ కలిసి పరిస్థితులను వివరిస్తాం. రేపు జరగబోయే నిర్మాతల మండలి ఎన్నికల్లో మేం గెలిస్తే.. మెడిైక్లెమ్ 4లక్షల నుంచి 5 లక్షలకు పెంచుతాం. కార్డులు కూడా వెంటనే అందిస్తాం.
చిన్న నిర్మాతలకు అండగా నిలుస్తాం. ఒక్క సినిమా చేసిన నిర్మాతకు కూడా మెడిైక్లెమ్ అందిస్తాం. గతంలో ఇచ్చినట్టుగా చదువుకు 30వేలిస్తాం. ఒక కుటుంబంలో ఒక ఆడబిడ్డ పెళ్లికి గతంలో ఇచ్చినట్టే 30వేలు, లేదా ఇంకా ఎక్కువ ఆర్థికసాయం అందిస్తాం. అలాగే పెన్షన్ కమిటీ వేసి వృద్ధులకు ఆర్థికసాయం అందిస్తాం. మరణించిన వారి కుటుంబాలకు అండగా నిలబడతాం. బిల్డింగ్ అద్దెల ద్వారా వచ్చిన సొమ్ముని 2032 నుంచి 30శాతం ఆదాయం సినిమా వారికే ఉపయోగిస్తాం. అలాగే వెబ్సైట్ ద్వారా చిన్న సినిమాలు ఓటీటీ బిజినెస్ జరిగేలా చూస్తాం. నిర్మాతల క్షేమమే మా ధ్యేయంగా ముందుకెళ్తాం’ అని వివరించారు. ఇంకా నిర్మాతలకు చదలవాడ శ్రీనివాసరావు, టి.ప్రసన్నకుమార్ కూడా మాట్లాడారు.