Bunny Vasu | ఐబొమ్మ వెబ్సైట్ అడ్మిన్ ‘రవి’ అరెస్ట్ టాలీవుడ్లో పెద్ద చర్చగా మారిన వేళ, సోషల్ మీడియాలో ఒక వింత ట్రెండ్ కనిపిస్తోంది. సినిమా టికెట్ రేట్లు అధికంగా ఉన్నాయనే పేరుతో పైరసీని సమర్థించే పోస్టులు పెరుగుతుండగా..“మాకు పైరసీ చేసేవాడే హీరో” అని కొందరిని ట్వీట్లు, రీల్స్ పెట్టడం ఇండస్ట్రీలోని పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఘాటుగా స్పందించారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ ఈవెంట్లో పాల్గొన్న ఆయన రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, పైరసీని సమర్థించే ధోరణిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పైరసీకి కారణంగా టికెట్ రేట్లను చూపించడం పూర్తిగా తప్పని బన్నీ వాసు స్పష్టం చేశారు. సంవత్సరానికి 100 సినిమాలు వస్తే… అందులో టికెట్ రేట్లు పెంచేది 10–15 పెద్ద సినిమాలకు మాత్రమే. మరి మిగిలిన 85 చిన్న సినిమాలను ఎందుకు పైరసీలో చూస్తున్నారు? అని ఆయన ప్రశ్నించారు. కొన్ని సినిమాలకు రేట్లు చాలా తక్కువే. అలాంటివి కూడా పైరసీ అవుతున్నాయి కదా? పెద్ద సినిమాలనే కాదు… కష్టపడి తీసిన చిన్న సినిమాలను కూడా పైరసీ చేసి చంపేస్తున్నారు అని బన్నీ వాసు తీవ్రంగా తెలిపారు. నిర్మాతల పరిస్థితిని గురించి మాట్లాడిన బన్నీ వాసు భావోద్వేగానికి గురయ్యారు.
బయట వాళ్లకు నిర్మాతలు అంటే కోట్లు ఉన్నవాళ్లు అనిపిస్తారు. కానీ నిజంగా ఎంతమంది నిర్మాతలు ఆస్తులు అమ్ముకుని సినిమాలు తీశారో తెలుసా? వాళ్లు చొక్కా విప్పితే వెనుక వాతలు కనిపిస్తాయి. గ్లామర్ ఫీల్డ్ కాబట్టి నవ్వుతూ బతుకుతున్నారే గానీ, లోపల వారికి ఎంత కష్టమో చెప్పలేం” అని అన్నారు. తాము పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం ఇలా దోచుకోవడం పూర్తిగా తప్పు అని ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పైరసీ చేసేవాళ్లను ‘రాబిన్ హుడ్’లా చూపించడంపై కూడా బన్నీ వాసు హెచ్చరిస్తూ.. “రేట్లు ఎక్కయ్యాయి కాబట్టి దొంగతనం చేయడం కరెక్ట్ కాదు. ఇది నేరం. పైరసీని గ్లోరిఫై చేయడం ఇంకా పెద్ద నష్టం. దీనివల్ల మంచి సినిమాలు, చిన్న సినిమాలు బతకలేకపోతున్నాయి. ఈ మైండ్సెట్ నుంచి బయటకు రావాలి” అని స్పష్టం చేశారు. బన్నీ వాసు మాట్లాడిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు, దర్శకులు ఆయన అభిప్రాయాలకు మద్దతు తెలుపుతున్నారు.