Bun Butter Jam | తమిళ నాట జులై 18న విడుదలై ఘన విజయం సాధించిన బన్ బటర్ జామ్ మూవీ (Bun Butter Jam).. తెలుగు సినీ ప్రేక్షకులను కూడా అలరించనుంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 22న విడుదల కానుంది.. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు ప్రీమియర్ షోస్ కూడా వేశారు. తమిళంలో రాజు జయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించగా, రెయిన్ ఆఫ్ ఎరోస్, సురేశ్ సుబ్రమణియన్ నిర్మాణంలో, రాఘవ్ మిర్దత్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక చార్లి, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిన, మైకేల్ తంగదుఐ, విజే పప్పు.. పలువురు కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.
కథ విషయానికి వస్తే..
చంద్రు(రాజు జెయమోహన్), మధుమిత(ఆధ్య ప్రసాద్) ఇంటర్ పూర్తి చేసి ఉంటారు. అయితే వారి పెరేంట్స్ పాత పరిచయాలతో ఓ పెళ్ళిలో చంద్రు, మధుమిత కలుసుకోవడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య అన్యోన్యత ఏర్పడుతుంది. ఇటీవల లవ్ అయినా అరేంజ్డ్ అయినా పెళ్లిళ్లు చెడిపోతున్నాయని, విడిపోతున్నారని అందుకే తమ పిల్లలకు ఫ్యూచర్లో లవ్ & అరేంజ్డ్ వాళ్లకు తెలియకుండానే చేయాలని చంద్రు తల్లి(శరణ్య), మధుమిత తల్లి(దేవదర్శిన) నిర్ణయించుకుంటారు. ఇందుకోసం మధుమిత కుటుంబం చంద్రు పక్కింట్లోకి దిగుతారు.
ఇక ఇంజినీరింగ్‌లో జాయిన్ అయ్యాక చంద్రు.. నందిని(భవ్య త్రిఖ) అనే మరో యువతి ప్రేమలో పడతారు. నందినిని చంద్రు బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్(మైకేల్ తంగదురై) కూడా లవ్ చేస్తాడు. ఇక మధుమిత ఆకాష్(VJ పప్పు)ని లవ్ చేస్తుంది. చంద్రు – మధుమితలను కలపాలని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ట్రై చేసినా సాధ్యం కాదు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు అసలు పడదు. విబేధాలు తారాస్థాయికి చేరుతాయి. ఓ సమయంలో ఇద్దరూ తమ లవర్స్‌తో ఒకరికొకరు దొరికిపోతారు. మరి వీళ్ళలో ఎవర్ని ఎవరు లవ్ చేస్తారు? ఎవరి ప్రేమలు బ్రేకప్ అవుతాయి? చివరకు ఎవరు ఎవర్ని పెళ్లి చేసుకుంటారు? చంద్రు – మధుమిత పేరెంట్స్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
మూవీ సారాంశం ఇదే..
బన్ బటర్ జామ్ సినిమా తమిళనాడు యువతకు బాగా దగ్గరైంది. అయితే మూవీ టైటిల్‌కు, ప్రధాన కథకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈ సినిమా ఒక లవ్ కామెడీ జానర్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత యూత్‌ని దృష్టిలో ఉంచుకుని ఉద్దేశించి చిత్రీకరించిన సినిమా అని చెప్పొచ్చు. సమాజంలో జరుగుతున్న ప్రేమకథలను ఆదర్శంగా తీసుకొని కామెడీ, ఎమోషన్స్‌ను వర్కౌట్ చేస్తూ తెరకెక్కించారు. ఫస్ట్ హాఫ్ అంతా ఫుల్‌గా నవ్విస్తూనే ఉంటారు. చంద్రు, మధుమిత, వాళ్ళ తల్లులు పాత్రలతో కడుపుబ్బా నవ్విస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
సినిమాలో లవ్కుసంబంధించిన డైలాగులు బాగానే వర్కౌట్ అయ్యాయి. బ్రేకప్ ఎమోషన్స్ కూడా బాగానే పండించారు. ఇక ఇంటర్వెల్ విరామం సమయానికి లవర్స్ ఒకరికొకరు దొరికిపోతారు. తర్వాత ఏం జరుగుతుందనే విషయంలో మంచి బ్యాంగ్ ఇచ్చారు. లవ్‌లో కూడా కామెడీ ట్విస్టులను అదరగొట్టేశారు. అయితే సెకండ్ హాఫ్‌లో కాస్త కథ సాగదీసినట్టు, అక్కడక్కడే తిరిగినట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ ముందే ఊహించినా దాన్ని ఇంకొంచెం క్లారిటీగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. ఓ నాలుగు డైలాగ్స్ చెప్పి ఇంతేనా అనిపిస్తారు క్లైమాక్స్.
ఇక చంద్రు – శ్రీనివాస్ మధ్య ఫ్రెండ్షిప్ మాత్రం కొన్ని సీన్స్‌లో గే స్టోరీ అనే ఫీలింగ్ వచ్చేలా కాస్త డ్రమాటిక్‌గా ఉందని చెప్పొచ్చు. వాళ్లే దాన్ని అదే గే డైలాగ్స్‌తో కవర్ చేయడం గమనార్హం. గతంలో మనం ఎవరితో ప్రేమలు, బ్రేకప్స్ ఉన్నా ఫ్యూచర్లో ఉండే వాళ్ళతో సంతోషంగా ఉండాలి అని ఓ మెసేజ్ అయితే ఇచ్చారు. మొత్తంగా సినిమా నవ్వుకుంటూనే అక్కడక్కడా ఎమోషన్ ఫీల్ అవుతూ చూసేయొచ్చు.
నటీనటుల అభినయం..
చంద్రు పాత్రలో రాజు జెయమోహన్ తన పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ బాగా మెప్పించాడు దర్శకుడు. భవ్య త్రిఖ రీల్స్ చేసే అమ్మాయి పాత్రలో క్యూట్‌గా కనిపిస్తూ అలరించింది. ఆధ్య ప్రసాద్ కూడా క్యూట్‌గా కనిపిస్తూనే సెటిల్డ్ పర్ఫార్మెన్స్తో మెప్పించింది. సీనియర్ నటీమణులు శరణ్య పొన్వన్నన్, దేవదర్శిన తల్లి పాత్రల్లో అదరగొట్టేసారు. ఒకోసారి వీళ్ళ కామెడీ చూస్తుంటే ఓవర్ యాక్టింగ్ అనిపించినా నవ్వక తప్పదు. విజె పప్పు ప్రతి సీన్లో నవ్వించి చివర్లో ఎమోషనల్‌గా మెప్పిస్తాడు. చార్లి, మైకేల్ తంగదురై.. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో మెప్పించారు.
మొత్తంగా ‘బన్ బటర్ జామ్’ సినిమా లవ్ స్టోరీలతో నవ్విస్తూ అక్కడక్కడా ఎమోషన్ పండిస్తూ యూత్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.