Buchi Babu | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సన తెరకెక్కించిన గ్రామీణ క్రీడా నేపథ్య చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తూ రూ.366 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటేసింది. అయితే సినిమా విడుదలకు ముందు, విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు, నెగెటివ్ ప్రచారాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శకుడు బుచ్చిబాబు సానా, సీనియర్ నటుడు జగపతి బాబు పాల్గొని సినిమా ప్రయాణం, ఎదురైన సవాళ్ల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లో జరిగిన కొన్ని పొరపాట్లను బుచ్చిబాబు స్వయంగా అంగీకరించడం చర్చనీయాంశంగా మారింది.
సినిమా విడుదలకు ముందు వచ్చిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆశించిన స్థాయిలో ఆసక్తి కలిగించలేదని బుచ్చిబాబు అభిప్రాయపడ్డారు. ట్రైలర్ ఎడిటింగ్ సమయంలో ఒకే వీడియోలో చాలా అంశాలను చూపించే ప్రయత్నం చేయడంతో కథపై స్పష్టత తగ్గిపోయిందన్నారు. పెద్ద సినిమాల విషయంలో ఇలాంటి పొరపాట్లు జరగకూడదు. ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్‌ను కలిపేయడంతో ప్రేక్షకులకు కథ అర్థం కాకుండా కన్ఫ్యూజన్ ఏర్పడింది. అదే సినిమాపై ప్రారంభంలో నెగెటివ్ ప్రభావం చూపింది అని ఆయన పేర్కొన్నారు. ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు సినిమా విడుదల సమయంలో నెలకొన్న పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో నెగెటివ్ ప్రచారం జరగడంతో చాలా మంది ఈ సినిమా విజయం సాధించదని చెప్పారని వెల్లడించారు.
సినిమా బాగా ఆడాలని కోరుకునే వ్యక్తులు కూడా ఇది వర్కవుట్ కాదని చెప్పేవారు. మొదట్లో వచ్చిన స్పందన చూసి నేను కూడా నిరాశకు గురయ్యాను. కానీ తర్వాత ప్రేక్షకుల ఆదరణతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది అని ఆయన అన్నారు. సినిమా విడుదలైన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని బుచ్చిబాబు తెలిపారు. ముఖ్యంగా యూట్యూబ్ రివ్యూవర్లు, ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడటం వల్లే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిందన్నారు. మౌత్ టాక్ బలపడటానికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు కీలక పాత్ర పోషించారు. వారి వీడియోలు, రీల్స్ ద్వారా సినిమా గురించి మంచి ప్రచారం జరిగింది. అందుకే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారు అంటూ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఇక సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రపై వచ్చిన విమర్శల గురించి కూడా బుచ్చిబాబు స్పందించారు. కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు, పాత్ర చిత్రణపై మహిళా ప్రేక్షకుల నుంచి అభ్యంతరాలు రావడంతో చిత్రబృందం వాటిని సీరియస్‌గా తీసుకుందని చెప్పారు.సినిమా అనేది ప్రేక్షకులను అలరించాలి, ప్రేరణ కలిగించాలి. ఎవరికైనా అసౌకర్యం కలిగించేలా లేదా వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉండకూడదు. వచ్చిన అభిప్రాయాలను మేము గౌరవంగా స్వీకరించాం అని బుచ్చిబాబు తెలిపారు. మహిళా పాత్రలను తక్కువ చేసి చూపాలనే ఉద్దేశం తమకు ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.