Peddi | గేమ్ ఛేంజర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది. ఉప్పెన ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్లో 16వ చిత్రంగా రూపొందుతుంది. గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో పెద్ది సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా ఓ టాక్ అయితే నడుస్తుంది. చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, జగపతిబాబులు కూడా ఇందులో నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్ద సినిమా నుంచి ఫస్ట్ షాట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. వీడియోలో మాస్ అవతార్ లో చరణ్ కనిపించగా, “ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ.” అంటూ ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ చెప్పి అదరగొట్టాడు గ్లోబల్ స్టార్. ఇక గ్లింప్స్ చివరలో రామ్ చరణ్ క్రికెట్ షాట్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈ షాట్ ఆలోచన ఎవరిది అనేది తాజాగా బుచ్చిబాబు వివరించారు. ఫైట్ మాస్టర్ నవకాంత్ ఆ షాట్‌ని డిజైన్ చేయగా, అతనికే ఆ క్రెడిట్ ఇవ్వాలని నేను అనుకుంటున్నాను అంటూ బుచ్చిబాబు చెప్పుకొచ్చారు.
గ్లింప్స్ రిలీజ్ రోజు నేను రామ్ చరణ్ ఇంట్లో ఉన్నా. చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. అయితే నచ్చుతుందా లేదా అని చాలా టెన్షన్ పడ్డాను. కాని చూశాక చిరంజీవి గారు చాలా బాగుంది అని అన్నారు అంటూ బుచ్చిబాబు తెలియజేశాడు. కరోనా టైమ్ లో పెద్ది ఆలోచన నాకు వచ్చింది. స్క్రిప్ట్ పూర్తి చేశాక సుకుమార్ గారికి వినిపిస్తే బాగుంది అని అన్నారు. రామ్ చరణ్‌కి కథ వినిపించమని అన్నారు. కాన్సెప్ట్, క్యారెక్టరైజేషన్ చరణ్‌కి బాగా నచ్చాయి. అలా ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లింది అని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇందులో చరణ్ ఆటకూలీగా కనిపించనున్నాడని టాక్.