Sid-Kiara | బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా – కియారా అడ్వాణీ ఈ నెల 7న వివాహబంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్ జైసల్మేర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కాగా, వివాహ వేడుకకు సంబంధించి ఓ వీడియోను కొత్త పెళ్లి కూతురు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
వీడియోలో కియారా.. ‘షేర్షా’ చిత్రంలోని పాటకు డ్యాన్స్ చేస్తూ వివాహ వేదికపైకి చేరుకుంది. అనంతరం కియారా-సిద్ధార్థ్ దండలు మార్చుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వీడియో చూసిన నెటిజన్లు పెళ్లితో ఒక్కటైన నవ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్లు పెడుతున్నారు.
షేర్షా సినిమాతో ఆన్‌స్క్రీన్ హిట్ పెయిర్‌గా నిలిచిన సిద్ధార్థ్, కియారా కొంతకాలానికి ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. హిందీ చిత్రసీమలో అగ్ర కథానాయికగా రాణిస్తున్న కియారా అద్వాణీ తెలుగులో ‘భరత్ అనే నేను’ ‘వినయ విధేయ రామా’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు చేరువైంది.