Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు , దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలోని శంకరపల్లిలో వేగంగా సాగుతోంది. ప్రస్తుతం వారణాసి నేపథ్యాన్ని ప్రతిబింబించేలా వేసిన భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్లో మహేష్ బాబు తో పాటు ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొంటూ ముఖ్యమైన సన్నివేశాల్లో నటిస్తున్నారు. ఈ షెడ్యూల్ మరో రెండు వారాల పాటు కొనసాగనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనుండగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అయితే, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మే నెల మొత్తం షూటింగ్‌కు విరామం ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విరామంలో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారని, మరోవైపు రాజమౌళి కూడా చిన్న విరామం తీసుకోనున్నట్లు సమాచారం. సాధారణంగా సినిమా పూర్తయ్యే వరకు నిరంతరం షూటింగ్ కొనసాగించే రాజమౌళి ఈసారి ఇలా బ్రేక్ ఇవ్వడం విశేషంగా మారింది.
ఇప్పటికే సుమారు 70 శాతం షూటింగ్ పూర్తి కావడంతో ఈ గ్యాప్ టీమ్‌కు రీఫ్రెష్ అయ్యే అవకాశం ఇస్తుందని భావిస్తున్నారు. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా సమాంతరంగా కొనసాగిస్తూ, 2027 వేసవిలో సినిమాను విడుదల చేయాలని దర్శకుడు లక్ష్యంగా పెట్టుకున్నారు. విరామం తర్వాత చిత్ర యూనిట్ అంటార్కిటికాలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడి చలి, సూర్యోదయం లేకపోవడం వంటి సవాళ్లు ఉండటంతో ఈ షెడ్యూల్ ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. కథ పరంగా చూస్తే, వారణాసి వంటి ఆధ్యాత్మిక నగర నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ జోడించి ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. గంగా ఘాట్ల సెట్లో మహేష్ బాబు లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని చెబుతున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.