టాలీవుడ్లో వినూత్న కథాంశాలతో వచ్చే చిత్రాలకు ప్రేక్షకులు ఎప్పుడూ బ్రహ్మరథం పడుతూనే ఉంటారు. అదే బాటలో సరికొత్త ప్రేమ, సస్పెన్స్ డ్రామాతో అలరించేందుకు సిద్ధమవుతోంది “కళ్యాణం కమనీయం జీవితం” చిత్రం. వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై ఖాన్ దురాని, సాహితి ఆవంచ హీరో హీరోయిన్లుగా రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ రాజవంశీ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, ప్రముఖ నటుడు జెమినీ సురేష్ ముఖ్య అతిథులుగా హాజరై, చిత్ర బృందానికి తమ అభినందనలు అందజేశారు.
ఈ వేడుకలో హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ.. ఇదొక అత్యంత మనోహరమైన చిత్రమని, సరికొత్త ప్రతిభావంతులైన యువ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంతో ప్యాషన్‌తో ఈ సినిమాకు పనిచేశారని పేర్కొన్నారు. సినిమా ప్రశాంతమైన వాతావరణంలో సాగుతూనే, ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని, ఈ కొత్త టీమ్‌ను ప్రేక్షకులు ఆశీర్వదించాలని కోరారు. అనంతరం హీరో ఖాన్ దురాని మాట్లాడుతూ.. గతంలో ఎన్నో మంచి సినిమాలు నిర్మించిన నిర్మాతలు, తను కొత్తవాడైనప్పటికీ తనపై నమ్మకంతో ఈ భారీ అవకాశాన్ని ఇచ్చారని కృతజ్ఞతలు తెలిపారు. సినిమాలో నాలుగు అద్భుతమైన పాటలు ఉన్నాయని, శ్రీ మురళి అందించిన సంగీతం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక విభిన్నమైన కథ, కథనంతో వస్తున్న ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని సపోర్ట్ చేయాలని కోరారు. సంగీత దర్శకుడు శ్రీ మురళీ కార్తికేయ మాట్లాడుతూ.. తను కంపోజర్ కావడానికి స్ఫూర్తినిచ్చిన ‘మనసంతా నువ్వే’ చిత్ర దర్శకులు వీఎన్ ఆదిత్య గారు తమ ఈవెంట్‌కు రావడం ఒక మరువలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు.
దర్శకుడు రాంప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్యూర్ తెలుగుదనంతో కూడిన “కళ్యాణం కమనీయం జీవితం” అనే అద్భుతమైన టైటిల్‌ను ఎంపిక చేసిన దర్శక నిర్మాతలను అభినందించారు. పేరుకు తగ్గట్టుగానే సినిమాలో పాటలు, సాహిత్యం ఎంతో అద్భుతంగా కుదిరాయని, ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రముఖ నటుడు జెమినీ సురేష్ మాట్లాడుతూ.. ప్రస్తుత రోజుల్లో తెలుగు సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ పెడుతున్న ట్రెండ్‌లో, దర్శకుడు రవి లోకిరెడ్డి ఎంతో ఆలోచించి పవిత్రమైన తెలుగు టైటిల్‌ను పెట్టడం అభినందనీయమన్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయేలా ఉంటుందని చెప్పారు. సీనియర్ దర్శకులు వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. దర్శకుడు రవి తన నిజ జీవితంలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నట్లు చెప్పారని, సాధారణంగా దర్శకుల సొంత జీవిత కథలతో వచ్చే లవ్ స్టోరీలు ఇండస్ట్రీలో బ్లాక్‌బస్టర్ హిట్స్ అయ్యాయని, అదే సెంటిమెంట్‌తో ఈ సినిమా కూడా సంచలన విజయం సాధిస్తుందని బరోసా ఇచ్చారు.
చిత్ర నిర్మాత కిషోర్ గుండాల మాట్లాడుతూ.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ గారు లాంచ్ చేయడం, చంద్రబోస్ గారు ఒక పాటను విడుదల చేయడం, ఇప్పుడు వీఎన్ ఆదిత్య గారు రావడం తమ టీమ్‌కు కొండంత బలాన్ని ఇచ్చిందన్నారు. కార్పొరేట్ రంగాన్ని వదిలి సినిమాలపై ప్యాషన్‌తో యూఎస్‌లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసి ఇండస్ట్రీకి వచ్చానని, గతంలో ’24 కిస్సెస్’ వంటి చిత్రాలు నిర్మించామని, భవిష్యత్తులో మరికొన్ని ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయని తెలిపారు. ప్రేక్షకులు కోరుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ బ్యూటిఫుల్ సినిమాలో ఉంటాయని హామీ ఇచ్చారు. చివరగా దర్శకుడు రవి లోకిరెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కష్టానికి ప్రతిరూపమే ఈ సినిమా అని ఎమోషనల్ అయ్యారు. తన జీవితంలోని కొన్ని సంఘటనలకు స్క్రీన్ ప్లే మ్యాజిక్, ఫిక్షనల్ ఎలిమెంట్స్ జోడించి ఈ లవ్, సస్పెన్స్ డ్రామాను తెరకెక్కించినట్లు చెప్పారు. రైటర్ అరవింద్ అందించిన ఒక సరికొత్త పాయింట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని, ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూనే, సీట్ ఎడ్జ్ థ్రిల్‌ను ఇస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. ఖాన్ దురాని, సాహితీ అవంచ, ఉదయ్ పులిమి, విషిక, సత్యానంద్ లంక తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఎన్ సి అరవింద్ ఏకలవ్య రచన అందించగా, వెంకటరాజు డి ఛాయాగ్రహణం అందించారు.