Brahmanandam | ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మంచు విష్ణు, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్ 27న విడుదల కానుండగా, గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బు కోసం చేసిన చిత్రం కాదు ఇది, సాక్ష్యాత్తు ఆ పరమేశ్వరుడే మోహన్ బాబు చేత ఈ మూవీని చేయించాడని, ఆయనలో ఈ ఆలోచన కల్పించారని చెప్పుకొచ్చారు. ప్రస్తుత కాలంలో కుర్రకారులో భక్తి సన్నగిల్లిపోయి అరాచకాలు పెరిగిపోతున్న సమయంలో భారతీయ తత్త్వాన్ని, శివ తత్త్వాన్ని తెలియపరచాలన్న ఉద్దేశంతో ఆ పరమశివుడే దగ్గరుండి మోహన్‌బాబు, విష్ణుతో ఈ సినిమా తీయించాడని అనిపిస్తుందని బ్రహ్మానందం అన్నారు.
ఇందాక మోహన్‌బాబు అలా నడిచి వస్తుంటే సాక్షాత్తూ పరమశివుడి సేవ చేసిన మహదేశ శాస్త్రి దిగివస్తున్నట్లు అనిపించింది. ఆయన కడుపున పుట్టిన విష్ణును కన్నప్పగా ఎంచుకోవడం వెనుక శివుడు ఆజ్ఞ ఉందనిపిస్తోంది. ఇందులో నటించిన ప్రభాస్ , మోహన్‌లాల్, శరత్‌కుమార్, అక్షయ్‌కుమార్ ఇలా అందరూ నటించడం వెనుక శివుడి పరమార్థం ఉంది. వీళ్లందరూ నటించారు అనడం కంటే శివుడి చేత నటించబడ్డారు అనాలేమో.మోహన్‌బాబు వేరే ఏ సినిమాలు చేసినా చూడండి లేదా పట్టించుకోకండి. ఆయన్ని ట్రోల్ చేయండి తప్పులేదు. కానీ భక్తి కోసం, శివతత్వాన్ని పెంపొందించడం కోసం తీసిన ఈ సినిమాని మాత్రం ఎవరూ ట్రోల్ చేయకండి. ఇది శివుడి కోసం శివుడే తీసుకున్న సినిమా. నేను ఆఖరుగా చెప్పేదొక్కటే.. . అభిమానించండి లేదా విమర్శించండి కానీ అల్లరి చేయొద్దు. ఎందుకంటే ఈ సినిమాతో శివుడు ప్రతి ఇంటికి చేరాలి… ప్రతి గుండెని తాకాలి అని ఎమోషనల్‌గా మాట్లాడారు బ్రహ్మానందం.
ఇక సుమ.. బ్రహ్మానందంకి పలు ప్రశ్నలు వేసింది. మోహన్ బాబు, విష్ణు.. ఇద్దరిలో ఎవరు అందగాడు? అని సుమ ప్రశ్నించగా, “విష్ణు మోస్ట్ హ్యాండ్సమ్” అని బ్రహ్మానందం చెప్పారు. మోహన్ బాబు సినిమాని మీరు రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారు? అని అడగ్గా .. అసెంబ్లీ రౌడీ అని చెప్పారు. ఆ సినిమా కోసం ముందుగా నన్నే సంప్రదించారు. ఆ సబ్జెక్ట్ మనకెందుకులే అనుకుని తిరస్కరించడంతో ఆ అవకాశం నాకు కల్పించండి’ అని మోహన్ బాబు మా ఇంటికొచ్చి ప్రాధేయపడితే ఇచ్చేశా అంటూ సరదాగా అన్నారు. ఇక ‘యమదొంగ’లో యముడి పాత్ర కోసం మొదట మిమ్మల్నే అనుకున్నారట కదా అని అడగ్గా, “లేదు. యముడి పాత్రకు మోహన్ బాబే సరిగ్గా సరిపోతారు… సినిమాల్లోనూ, బయట కూడా ఆయన అలాగే ఉంటారు” అని బదులిచ్చారు. మోహన్ బాబులో మీకు నచ్చే, నచ్చని విషయాలు ఏంటి? అని సుమ ప్రశ్నించగా, “నచ్చేది, నచ్చనిది రెండూ లేవు. అసలు నాకు మోహన్ బాబే నచ్చడు” అంటూ సరదాగా అనడంతో అందరు నవ్వేశారు.