అఖండ తర్వాత బాలకృష్ణ నటించబోయే సినిమాలపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బాలయ్య. ముందు నుంచి దీనిపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. పైగా మైత్రి మూవీ మేకర్స్ బడ్జెట్ కు వెనకాడకుండా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక ఖర్చుతో తీస్తున్న సినిమా ఇది. ఇందులో ఊరి పెద్దగా, రాజకీయ నాయకుడిగా బాలకృష్ణ కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. క్రాక్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత గోపీచంద్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా యాక్షన్ సన్నివేశాల గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
మామూలుగానే యాక్షన్ సీన్స్ బాగా తెరకెక్కిస్తాడనే గుర్తింపు గోపిచంద్ మలినేనికి ఇండస్ట్రీలో ఉంది. క్రాక్ సినిమా అంత పెద్ద విజయం సాధించింది అంటే అందులో ఉన్న యాక్షన్ సన్నివేశాలే ప్రధాన కారణం. ఇప్పుడు బాలయ్య సినిమాకు కూడా ఏమాత్రం తగ్గడం లేదు ఈయన. అదిరిపోయే 5 యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని.. వాటి గురించి బాలయ్య కూడా చాలా కష్టపడుతునట్లు తెలుస్తోంది. 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా కుర్ర హీరోలతో పోటీ పడుతూ బాలయ్య చేస్తున్న మాస్ యాక్షన్ సన్నివేశాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి.
ఇదిలా ఉంటే గోపీచంద్ సినిమాకు బోయపాటి మాట సాయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాల గురించి మాస్ డైరెక్టర్ నుంచి గోపీచంద్ కొన్ని టిప్స్ తీసుకున్నాడని.. బాలయ్యని ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఫిదా అయిపోతారనే విషయంపై కూడా గోపీచంద్, బోయపాటి డిస్కస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య సినిమా లొకేషన్ కు బోయపాటి వచ్చాడు. కాసేపు అక్కడే ఉండి షూటింగ్ చూసి దర్శక నిర్మాతలతో పాటు బాలయ్యతో ముచ్చటించి వెళ్ళాడు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. కన్నడలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన మఫ్టీ సినిమాకు ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతున్నా.. అందులో ఎలాంటి నిజం లేదని కొట్టి పారేశాడు గోపీచంద్ మలినేని. దసరాకు సినిమా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అప్పుడు కుదరని పక్షంలో 2023 సంక్రాంతికి సినిమాను విడుదల చేయనున్నారు. శృతి హాసన్ ఇందులో హీరోయిన్. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. దీనికి ఒక పవర్ ఫుల్ టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నాడు గోపీచంద్ మలినేని. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.