Border 2 | ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు ఒక్కటే ‘బోర్డర్ 2’. విడుదల రోజునే మార్నింగ్ షోలు కొన్ని చోట్ల టెక్నికల్ కారణాలతో రద్దయినా, ఆ ప్రభావం బాక్సాఫీస్‌పై ఏమాత్రం కనిపించలేదు. అసలు ఊహించని స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లతో దూసుకుపోతూ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జీత్ దోసాంజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ దేశభక్తి యాక్షన్ డ్రామా, రిపబ్లిక్ డే వీకెండ్‌ను పూర్తిగా తన ఖాతాలో వేసుకుంది. వర్డ్ ఆఫ్ మౌత్ బలపడటంతో, రోజురోజుకీ థియేటర్ల ముందు హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
తాజా అధికారిక లెక్కల ప్రకారం, ‘బోర్డర్ 2’ కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల మార్క్‌ను దాటింది. ఇండియాలోనూ ఈ సినిమా రికార్డు స్థాయి వసూళ్లతో 2026 బాక్సాఫీస్ రేసులో టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. దర్శకుడు అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ చిత్రం దేశీయ మార్కెట్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది.నాలుగు రోజుల్లో ఇండియాలో రూ. 180 కోట్లు (నెట్) వసూలు చేసింది. పన్నులతో కలిపి ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ. 212.5 కోట్లు . ఓపెనింగ్ డే రూ. 30 కోట్లతో మొదలైన ప్రయాణం, రోజురోజుకీ వేగం పెంచుకుంది. ప్రత్యేకంగా జనవరి 26 రిపబ్లిక్ డే సెలవు సినిమాకు భారీగా కలిసి వచ్చింది. ఒక్క ఆ రోజే రూ. 59 కోట్ల నెట్ వసూలు చేయడం విశేషం. మొదటి రోజు కంటే నాలుగో రోజు డబుల్ కలెక్షన్స్ రావడం ట్రేడ్‌లో అరుదైన విషయం.
దేశీయంగానే కాదు, అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ‘బోర్డర్ 2’కు మంచి స్పందన లభిస్తోంది. ఓవర్సీస్లో సుమారు $4.3 మిలియన్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్ నాలుగు రోజుల గ్రాస్: రూ. 251 కోట్లు. ముఖ్యంగా యూకే, కెనడా వంటి దేశాల్లో సన్నీ డియోల్‌కు ఉన్న ఫ్యాన్‌బేస్ మరోసారి బయటపడిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ కలెక్షన్ ప్రభంజనంలో, రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ ఓపెనింగ్ వీకెండ్ రికార్డులు వెనక్కి వెళ్లాయి. స్టార్ ఇమేజ్ కంటే కథ, భావోద్వేగం ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్తాయన్న విషయాన్ని ‘బోర్డర్ 2’ మరోసారి నిరూపించిందనే అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా విడుదల రోజున షోలు క్యాన్సిల్ అయితే నెగిటివ్ టాక్ వస్తుంది. కానీ ‘బోర్డర్ 2’ విషయంలో అది పూర్తి భిన్నంగా జరిగింది. ప్రస్తుత వేగం కొనసాగితే, ‘బోర్డర్ 2’ రూ. 500 కోట్ల క్లబ్లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.