‘జీవితంలో నేను ఎదుర్కొన్న, నాలో ఆలోచనల్ని రేకెత్తించిన సంఘటనల నుంచి స్ఫూర్తి పొందుతూ కథలు రాస్తుంటాను. స్వీయ విశ్లేషణ చేసుకునే క్రమంలో నేను చేసే తప్పొప్పులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగుతాను’ అని అన్నారు బొమ్మరిల్లు భాస్కర్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అఖిల్, పూజాహెగ్డే జంటగా నటించారు. బన్నీవాస్, వాసువర్మ నిర్మించారు. ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం హైదరాబాద్‌లో బొమ్మరిల్లు భాస్కర్ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి..
జీవితభాగస్వామిని ఎంచుకోవడానికి ఉండాల్సిన అర్హతలేమిటి?పెళ్లి తర్వాత ఎదురయ్యే సమస్యల్ని అధిగమించడానికి యువత ఎంతవరకు సన్నద్ధంగా ఉంటున్నారనే పాయింట్ నుంచి ఈ కథ రాయడం మొదలుపెట్టాను. అందరి జీవితాల్లో ఉండే ఓ కామన్ పాయింట్‌ను నాకున్న పరిధుల్లో వినోదాత్మక పంథాలో చూపించాను. కష్టసుఖాలు కలిసి పంచుకోవడానికి ఓ తోడు ఉండాలని చూపించే ప్రయత్నం చేశాం. పెళ్లి తర్వాత కలిసి ఉంటున్నామని అనుకుంటున్న జంటలు చాలా మంది మానసికంగా దూరంగా బతుకుతున్నారనే అంశాన్ని అర్థవంతంగా చాటిచెప్పాం. సినిమాలో చెప్పిన పాయింట్‌తో యువతరం కనెక్ట్ అవుతున్నారు. పతాక ఘట్టాలు ఉద్వేగభరితంగా ఉన్నాయంటున్నారు. ఓ నవ్వు వెనుక ఎన్నో బాధలుంటాయని చాటిచెబుతూ పూజాహెగ్డే పాత్రను విభిన్నంగా తీర్చిదిద్దా. పెళ్లి, అనుబంధాలపై నమ్మకం కలిగి వాటి కోసం అన్వేషించే అమ్మాయిగా ఆమె పాత్ర ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. నటుడిగా అఖిల్‌ను కొత్త కోణంలో ఆవిష్కరించిన చిత్రమిది.
అందువల్లే గ్యాప్ వచ్చింది
సక్సెస్‌కు నేను విలువ ఇవ్వను. కానీ ఫెయిల్యూర్స్‌ను స్వీకరిస్తా. ప్రతి సినిమాతో పేరు, డబ్బుల కంటే వ్యక్తిగతంగా పరిణితి రావాలని కోరుకుంటాను. ఒక పాయింట్‌ను అనుకున్న తర్వాత దానిని కథ రూపంగా మలచడానికి చాలా సమయం తీసుకుంటాను. అందుకే నా సినిమాల మధ్య ఎక్కువగా విరామం ఉంటుంది. ఇకపై వేగం పెంచాలని అనుకుంటున్నా. గ్యాప్ వల్ల కెరీర్‌కు ఇబ్బందులు వస్తాయనే భయం నాలో లేదు. మలయాళ చిత్రం ‘బెంగళూరు డేస్’ తెలుగు, తమిళంలో తెరకెక్కించే అవకాశం వచ్చింది. ఈ మల్టీస్టారర్ సినిమాను భారీ స్థాయిలో చేయాలని అనుకున్నాం. నటీనటుల ఎంపికకే ఏడాది పట్టింది. దాంతో తెలుగు వెర్షన్‌ను పక్కనపెట్టి తమిళంలో పూర్తిచేశాం. ఆ సినిమా కోసం ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. దర్శకరచయితగా నాకు పూర్తిస్థాయిలో సంతృప్తి ఎప్పుడూ ఉండదు. ప్రతి కథను మరింత లోతుగా చెబితే బాగుంటుందనే ఆలోచన ఉంటుంది. స్క్రీన్ప్లేరైటర్గా ‘బొమ్మరిలు’్ల నాకు చాలా సంతృప్తిని మిగిల్చింది. కొన్ని ఫిల్మ్స్ స్కూల్స్ ఆ స్క్రీన్‌ప్లేను పాఠంగా వాడుకుంటున్నారు. తదుపరి సినిమాకు కథ సిద్ధమైంది. ఏ హీరోతో చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదు.