అందాల తార రేఖను ఆకాశానికి ఎత్తేస్తున్నది బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్. ఆమె ఓ అద్భుతమైన నటి అని కొనియాడుతున్నది. 20 ఏళ్లక్రితం వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం.. పరిణీత. తాజాగా, మళ్లీ థియేటర్లలో రీ-రిలీజైంది. ఈ సందర్భంగా ఆ సినిమాలోని ‘కైసీ పహేలి జిందగాని’ పాట ముచ్చట్లను పంచుకున్నది సునిధి. “కైసీ పహేలి జిందగాని.. నాకు ఎంతో ప్రత్యేకమైన పాట. క్యాబరే వైబ్తో అత్యంత ఆకర్షణీయంగా సాగుతుంది. అన్నిటికన్నా స్పెషల్.. ఈ పాటలో ఐకాన్ స్టార్ రేఖ నృత్యాభినయం. నా గొంతుకు సరిపోయేలా హావభావాలు పలికించడం.. ఆమెకే చెల్లింది.
అందుకే, ఇరవై ఏళ్లు అవుతున్నా.. నేటికీ ఈ పాట ప్రజల హృదయాల్లో నిలిచిపోయింది” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పాటను రికార్డ్ చేసినప్పుడు అందులో రేఖ నటిస్తుందని తనకు తెలియదనీ, ఆమె తెరపై కనిపించి.. తనను చాలా బాగా హైలైట్ చేసిందనీ ఆనందం వ్యక్తం చేసింది సునిధి. “ఆమె ఒక లెజెండ్. నేను జీవితకాలం ఆరాధించే వ్యక్తి!” అంటూ కొనియాడింది. శరత్ చంద్ర ఛటోపాధ్యాయ రాసిన బెంగాలీ నవల ఆధారంగా.. ‘పరిణీత’ చిత్రం తెరకెక్కింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో.. విద్యాబాలన్, సైఫ్ అలీఖాన్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో నటించారు.
ఇక కైసీ పహేలి జిందగాని.. పాటలో రేఖ జాజ్ గాయనిగా, వింటేజ్ లుక్లో కనిపిస్తుంది. ఈ పాటకు స్వానంద్ కిర్కిరే సాహిత్యం అందించగా.. శంతను మొయిత్రా స్వరాలు సమకూర్చారు. గాయని సునిధి చౌహాన్ విషయానికి వస్తే.. నాలుగేండ్ల వయసు నుంచే పాటల ప్రదర్శనలు ఇచ్చింది. ‘శాస్త్ర’ చిత్రంతో 13 ఏండ్లకే సినిమా కెరీర్ను ప్రారంభించింది. అదే ఏడాది ‘మేరీ అవాజ్ సునో’ అనే రియాలిటీ షో ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది. 1999లో వచ్చిన మస్త్ చిత్రంలోని ‘రుకీ రుకీ సీ జిందగీ’ పాటతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నది. నేపథ్య గాయనిగా అనేక అవార్డులు అందుకున్నది.