Vikram Bhatt | ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్, అతని భార్య శ్వేతాంబరి భట్‌ను రాజస్థాన్ పోలీసులు భారీ ఆర్థిక మోసం కేసులో అరెస్టు చేశారు. సుమారు రూ.30 కోట్ల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ దంపతులను ముంబైలో అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ కోసం ఉదయ్‌పూర్‌కు తరలిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. ఉదయ్‌పూర్‌లో పాపులర్ అయిన ఐవీఎఫ్ హాస్పిటల్ (Indira IVF Hospital) వ్యవస్థాపకుడు, డాక్టర్ అజయ్ ముర్దియా అతడి దివంగత భార్య జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ (Biopic) తీస్తామని, ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందని నమ్మించి వారి వద్ద నుంచి రూ.30 కోట్లు తీసుకున్నట్లు అజయ్ తెలిపాడు. అయితే ఈ సినిమా నిర్మాణం అనుకున్న విధంగా సాగకపోవడం.. లాభాల విషయంలో క్లారిటీ లేకపోవడంతో మోసపోయానని భావించిన డాక్టర్ ముర్దియా ఉదయ్‌పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక ముర్దియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉదయ్‌పూర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ముంబైకి పంపించి విక్రమ్ భట్, శ్వేతాంబరి భట్లను అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం ట్రాన్సిట్ రిమాండ్‌పై ఉదయ్‌పూర్‌కు తరలించే ప్రక్రియ జరుగుతున్నట్లు సమాచారం.
అయితే తమపై వచ్చిన ఆరోపణలను విక్రమ్ భట్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ కేసు పూర్తిగా నిరాధారం (Baseless) అని ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేశారని ఆయన ఆరోపించారు. సినిమా నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేసింది డాక్టర్ ముర్దియానే. సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు మరియు కార్మికులకు చెల్లించాల్సిన సుమారు రూ. 25 కోట్లకు పైగా డబ్బును ఎగ్గొట్టేందుకు, పరువు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఆయన ఈ తప్పుడు కేసు పెట్టారు అని విక్రమ్ భట్ తరఫు న్యాయవాది తెలిపారు.