కెరీర్ మొదట్లో కొందరు తనను తక్కువ అంచనా వేశారని చెబుతున్నది బాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ఫరాఖాన్. బిగ్ బీ, షారుక్ సహా.. బాలీవుడ్‌లోని అందరు అగ్రతారలతో కలిసి పనిచేసిందామె. అయితే, స్టార్ హీరో-హీరోయిన్లతో తాను ఎప్పుడూ, ఎలాంటి ఇబ్బందులు పడలేదని గతంలో పలు ఇంటర్యూలలో చెప్పింది. అయితే, కెరీర్ తొలినాళ్లలో మాత్రం.. కొందరు తన టాలెంట్‌పై అనుమానాలు వ్యక్తం చేసేవారని వాపోయింది. వారిలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ కూడా ఉన్నాడని పేర్కొన్నది. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. కెరీర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వెల్లడించింది. “విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ సినిమా ‘1942: ఎ లవ్ స్టోరీ’.
దానికి నేను కొరియోగ్రాఫర్‌గా చేశా. అప్పటికి నేను ఇండస్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. దాంతో.. అనిల్ కపూర్ నన్ను తక్కువగా అంచనా వేశాడు. ఇది చాలా పెద్ద సినిమా అనీ, నేను సరిగ్గా చేయలేనని దర్శకుడు వినోద్ చోప్రాతో చెప్పాడు. అప్పటి సీనియర్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్‌ను సంప్రదించమని సిఫారసు చేశాడ” ని నాటి సంగతులను గుర్తుచేసుకున్నది. అయితే, ఆ తర్వాత తన కొరియోగ్రఫీని చూసి అనిల్ కపూర్ ఆశ్చర్యపోయాడట. తనకు సారీ చెప్పాడట. ఆ తర్వాత ఇద్దరూ కలిసి పలు విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ఫరాఖాన్ విషయానికి వస్తే.. కొరియోగ్రాఫర్‌గా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. దర్శకురాలిగా, నిర్మాతగానే కాకుండా.. నటిగానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. 1992లో వచ్చిన ‘జో జీతా వొహీ సికందర్’ చిత్రంతో నృత్య దర్శకురాలిగా పరిచయమైంది.
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు దక్కించుకున్నది. అయితే, తాను అనుకోకుండానే కొరియోగ్రఫీలోకి వచ్చినట్లు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది ఫరా. 1998లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ సే’ సినిమాలోని ‘ఛల్ చయ్య చయ్య’ పాటతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నది. ఇప్పటివరకూ 100కి పైగా పాటలకు కొరియోగ్రఫీ చేసింది. ఈ క్రమంలో ఏడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకుంది. 2004లో ‘మై హూ నా’తో దర్శకురాలి అవతారం ఎత్తింది. ఓం శాంతి ఓం, తీస్మార్ ఖాన్ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించింది.